స్టేడియాల్లో మూడు జోన్లు
ABN , First Publish Date - 2020-08-11T09:25:16+05:30 IST
కరోనా కారణంగా భారత్‌ను వదిలి యూఏఈకి తరలిన ఐపీఎల్ కోసం బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే సమగ్ర

ఐపీఎల్ ఎస్ఓపీ
జోన్ 1: ఆటగాళ్లు, మ్యాచ్
అధికారుల ఏరియా (పీఎంఓఏ)తో పాటు ఆట జరిగే స్థలం (ఎఫ్ఓపీ)
జోన్ 2: ఇన్నర్ జోన్ - స్టేడియం కాంప్లెక్స్ లోపల జరిగే అన్ని
కార్యక్రమాలు
జోన్ 3: ఔటర్ జోన్ - స్టేడియం కాంప్లెక్స్ బయట జరిగే కార్యక్రమాలు. సభ్యులందరూ వారికి సంబంధించిన జోన్లలోనే ఉంటూ తమ పనులు చేసుకోవడంతో పాటుగా, వీలైనంత వరకు నేరుగా కాకుండా ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా సంభాషించుకోవడం ఉత్తమమని ఎస్ఓపీలో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: కరోనా కారణంగా భారత్‌ను వదిలి యూఏఈకి తరలిన ఐపీఎల్ కోసం బీసీసీఐ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోబోతోంది. ఇప్పటికే సమగ్ర విధివిధానాల(ఎస్ఓపీ)ను ఆయా ఫ్రాంచైజీలకు అందించింది. దీనిలో 16 పేజీల్లో క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఆరోగ్య, భద్రతకు సంబంధించిన ప్రొటోకాల్స్ ఉన్నాయి. కచ్చితంగా వీటన్నింటినీ అందరూ పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్టేడియం పరిసరాల్లో మూడు జోన్లను ఏర్పాటు చేసి నిర్బంధంగా అమలుపరచబోతున్నారు. దాదాపుగా ఈ జాబితాలో ఉన్న అంశాలే ఖరారు కానుండగా చివరి నిమిషంలో పలు మార్పులు జరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఒకసారి వాటిని పరిశీలిస్తే..
బయో సెక్యూర్ వాతావరణం
ఈనెల 20 తర్వాతే ఆటగాళ్లంతా ప్రత్యేక విమానాల్లో యూఏఈకి బయలుదేరబోతున్న విషయం తెలిసిందే. అంతకు ఒక రోజు ముందే రెండు పీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడికెళ్లాక కూడా కొవిడ్-19 టెస్టులు తప్పనిసరి చేసింది. మరోవైపు లీగ్‌లో పాల్గొనే 8 ఫ్రాంచైజీలు వేర్వేరు హోటళ్లలో బసచేయాలి. వీలైతే ఫ్లోర్ మొత్తాన్ని బుక్ చేసే వీలుంది. వసతి, శిక్షణ, మ్యాచ్‌లు, రవాణాకు సంబంధించి ఎలా నడుచుకోవాలో కూడా మార్గదర్శకాలను ప్రకటించింది. ఇక స్టేడియం పరిసరాల్లో బయో సెక్యూర్ వాతావరణాన్ని 4 జోన్లుగా విభజించింది.
మీటింగ్స్, డ్రెస్సింగ్ రూమ్: జట్టు సమావేశాలను కూడా ప్రత్యక్షంగా కాకుండా వీడియో కాల్ లేదా కాన్ఫరెన్స్ ద్వారా జరపాలని సూచించింది. ఒకవేళ కచ్చితంగా అలాగే జరపాల్సిన పరిస్థితి ఏర్పడితే గదుల్లో కాకుండా భౌతిక దూరం పాటిస్తూ అవుట్ డోర్లో పెట్టుకోవచ్చు. ఇండోర్ గదులు కూడా చాలా పెద్దగా ఉంటూ నిబంధనలు పాటిస్తేనే అనుమతి ఉంటుంది. ఇక డ్రెస్సింగ్ రూమ్ కూడా కీలకం కావడంతో అవసరమైన సిబ్బంది మాత్రమే అందులో ఉండాలి.
ప్లేయర్స్ జోన్, మ్యాచ్ ప్రొటోకాల్స్
జిమ్‌ను ఉపయోగించుకునేందుకు కూడా నిర్ణీత సంఖ్యలోనే ఆటగాళ్లను అనుమతించనున్నారు. ఎవరి వస్తువులు వారే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్‌ల సందర్భంగా గ్రౌండ్లోకి ఒకే మార్గం ద్వారా ప్రవేశించాలి. ఇక్కడికి చేరుకునేందుకు బస్సుల్లో కిటికీ పక్కన మాత్రమే ఒకరు కూర్చోవాల్సి ఉండగా.. డ్రైవర్‌తో సంబంధం లేకుండా ఉండేలా ఓ ప్లాస్టిక్ షీట్‌ను ఏర్పాటు చేస్తారు. టాస్ వేశాక ఆటగాళ్ల జాబితాతో ఉన్న పేపర్‌ను ఇరు జట్ల కెప్టెన్లు మార్చుకోవడం పరిపాటి. అలా కాకుండా ఈసారి ఎలకా్ట్రనిక్ టీమ్ షీట్‌ను ఉపయోగిస్తారు. డ్రింక్స్ విరామానికి ముందు.. ఆ తర్వాత కూడా ప్లేయర్స్ తమ చేతులను శానిటైజ్ చేసుకుంటారు.
కరోనా వస్తే..
లీగ్ సందర్భంగా ఎవరికైనా కరోనా సోకినా.. అనుమానిత లక్షణాలున్నా. రెండు వారాల పాటు జట్టుకు దూరంగా ఉండాల్సిందే. టీమ్ డాక్టర్ ఈ విషయాన్ని ఐపీఎల్ మెడికల్ మేనేజర్‌కు చేరవేస్తాడు. అతడిని గుర్తింపు పొందిన ఆస్పత్రులలో చేర్చి జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. రెండు వారాల ఐసోలేషన్ తర్వాత 24 గంటల వ్యవధిలో రెండు పీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్‌గా రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అతడు బయో సెక్యూర్ వాతావరణంలోకి అడుగుపెడతాడు.
అనుమతి వచ్చేసింది..
యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకున్న చివరి అడ్డంకి కూడా తొలగిపోయింది. అక్కడ లీగ్‌ను జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతిచ్చింది. ఈ విషయమై హోం, విదేశాంగ శాఖల నుంచి తమకు లిఖిత పూర్వక అంగీకారం లభించినట్టు లీగ్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపాడు. ‘ఇంతకుముందే మాకు మౌఖిక ఆదేశం అందాక యూఏఈ క్రికెట్ బోర్డుకు విషయాన్ని తెలిపాం. ఇప్పుడు మా దగ్గర లేఖ కూడా ఉంది కాబట్టి ఫ్రాంచైజీలు కూడా తమ కార్యకలాపాలను వేగవంతం చేసుకోవచ్చు’ అని తెలిపాడు. ఆగస్టు 20 తర్వాత అన్ని జట్ల ఆటగాళ్లు యూఏఈకి చేరుకోనున్నారు.