ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్‌లో అశ్లీల చిత్రాలు!

ABN , First Publish Date - 2020-04-25T09:48:39+05:30 IST

అది.. భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌), భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్...

ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్‌లో అశ్లీల చిత్రాలు!

 వెంటనే లాగౌట్‌ అయిన గోపీచంద్‌

న్యూఢిల్లీ: అది.. భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్‌), భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న ఆన్‌లైన్‌ కోచింగ్‌ సెషన్‌. దీంట్లో దేశ వ్యాప్తంగా 700 మందికి పైగా కోచ్‌లు పాల్గొని శ్రద్ధగా సూచనలు వింటున్నారు. వీరందరికీ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, ఇండోనేసియా కోచ్‌లు అగుస్‌ దివి సాంటోసో, నమ్రి సురోటో మార్గ నిర్దేశకం చేస్తున్నారు. అంతా బాగానే సాగుతున్న వేళ.. ఒక్కసారిగా స్ర్కీన్‌పై అశ్లీల చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. ఆ సమయంలో కోచ్‌ సాంటోసో క్లాస్‌ చెబుతున్నాడు. ఏం జరుగుతోందో అర్థం కాక అందరూ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. సెషన్‌లో తరచుగా అలాంటి చిత్రాలే వస్తుండడంతో లైవ్‌లో ఉన్న గోపీచంద్‌ వెంటనే లాగౌట్‌ అయ్యాడు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సెషన్‌లో మహిళా కోచ్‌లు కూడా ఉన్నారని, ఇది చాలా ఇబ్బంది కలిగించిందని అందులో పాల్గొన్న ఓ కోచ్‌ అన్నాడు. కరోనా కారణంగా 21 రోజుల పాటు బాయ్‌, సాయ్‌ ఈ ఆన్‌లైన్‌ క్లాసులను నిర్వహిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాడొద్దని సూచించిన ‘జూమ్‌’ వీడియో కాల్‌ యాప్‌నే వీరూ వినియోగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆన్‌లైన్‌ సెషన్‌ హ్యాక్‌ కాలేదని ‘సాయ్‌’ పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని సాయ్‌, బెంగళూరు శాఖ తెలిపింది. దీనిపై సాయ్‌ ఐటీ డిపార్ట్‌మెంట్‌ విచారణ చేస్తోంది.

Updated Date - 2020-04-25T09:48:39+05:30 IST