సీఎస్‌కే షోలే అయితే.. మేమిద్దరం జై, వీరు: రైనా
ABN , First Publish Date - 2020-08-20T22:09:09+05:30 IST
ధోనీతో పాటుగా రిటైర్మెంట్ ప్రకటించి రైనా అందరినీ షాక్‌కు గురిచేశాడు. ప్రస్తుతం ధోనీ, రైనా సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు..

న్యూఢిల్లీ: ధోనీతో పాటుగా రిటైర్మెంట్ ప్రకటించి రైనా అందరినీ షాక్‌కు గురిచేశాడు. ప్రస్తుతం ధోనీ, రైనా సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రైనా.. ధోనీతో తన ఫ్రెండ్‌షిప్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. క్రికెట్‌లో తన తొలినాళ్ళ నుంచి ధోనీతో పరిచయం ఉందని, అదే గొప్ప అనుబంధంగా మారిందని రైనా చెప్పాడు. ధోనీ అద్భుతమైన ఆటగాడని, మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సత్తా అతడి సొంతమని రైనా కొనియాడాడు. ధోనీ మునుపటికంటే ఇప్పుడు మరింత ఫిట్‌గా ఉన్నాడని, ఐపీఎల్‌లో కచ్చితంగా రాణిస్తాడని అన్నాడు. చెన్నై ఫ్యాన్స్ తమను ఎంతో అభిమానిస్తున్నారని, వారి అంచనాలకు తగ్గట్టు రాణిస్తామని చెప్పాడు. ‘షోలే సినిమాలో జై, వీరు ఎలానో.. చెన్నై జట్టుకు ధోనీ, రైనా అలా’ అని అభిమానులు అంటుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ధోనీని తలా అని, తనను చిన్నతలా అని చెన్నై ఫ్యాన్స్ గౌరవించడం ఎప్పటికీ మర్చిపోలేనని రైనా పేర్కొన్నాడు.