కిట్‌ బ్యాగ్‌తో.. ఫెన్సింగ్‌ ప్రాక్టీస్‌

ABN , First Publish Date - 2020-05-13T09:44:09+05:30 IST

కొవిడ్‌-19 ధాటికి విశ్వవ్యాప్తంగా ఎలాంటి టోర్నమెంట్లు లేకపోవడంతో క్రీడాకారులంతా తమ ఫిట్‌నె్‌సను కాపాడుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా...

కిట్‌ బ్యాగ్‌తో.. ఫెన్సింగ్‌ ప్రాక్టీస్‌

భవానీ దేవి నయా ట్రిక్‌


చెన్నై: కొవిడ్‌-19 ధాటికి విశ్వవ్యాప్తంగా ఎలాంటి టోర్నమెంట్లు లేకపోవడంతో క్రీడాకారులంతా తమ ఫిట్‌నె్‌సను కాపాడుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా భారత స్టార్‌ ఫెన్సర్‌ సీఏ భవాని కూడా ఇంట్లోనే సరికొత్త రీతిలో శిక్షణ కొనసాగిస్తోంది. అందుకు తన టార్గెట్‌ ప్రాక్టీస్‌ కోసం ఆమె కిట్‌ బ్యాగ్‌నే వాడుకుంటుండడం విశేషం. 26 ఏళ్ల ఈ తమిళనాడు ఫెన్సర్‌ పట్టుదల, అంకిత భావంతో ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చాలా పతకాలు సాధించి దేశంలో ఈ క్రీడకు పేరు తెచ్చింది. ‘పరిస్థితులు కొలిక్కి వచ్చేలోగా మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండేందుకు కనీస ఫిట్‌నెస్‌తో పాటు ఫెన్సింగ్‌ను   ప్రాక్టీస్‌ చేస్తున్నా. దీనికి మా ఇంటి టెర్ర్‌సను వినియోగించుకుంటున్నా. కొన్నిసార్లు డంబెల్స్‌ను వాడుతున్నా.. ఎక్కువగా శారీరక వ్యాయామమే చేస్తున్నా. ఫెన్సింగ్‌ విషయానికి వస్తే ఫుట్‌వర్క్‌పై దృష్టి పెట్టా. అలాగే నా ఫెన్సింగ్‌ కిట్‌ను ఉపయోగించుకుంటూ టార్గెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఈ విశ్రాంతి సమయాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నా’ అని భవానీ తెలిపింది. అంతర్జాతీయ వేదికపై భారత్‌కు తొలి పతకాన్ని అందించిన ఫెన్సర్‌గా పేరు తెచ్చుకున్న భవానీ ఒలింపిక్స్‌ ప్రాతినిధ్యంపై కన్నేసింది. దీంట్లో భాగంగా తన ఇటలీ కోచ్‌ నికోలా జనోట్టితో ఆన్‌లైన్‌ ద్వారా సూచనలను కూడా తీసుకుంటోంది. అలాగే ఫెన్సింగ్‌ వీడియోలు చూస్తూ తన ఆటను మెరుగుపర్చుకుంటోంది.


కరోనా నుంచి కొద్దిలో..

కరోనా మహమ్మారి నుంచి తాను కొద్దిలో తప్పించుకున్నట్టు భవాని వెల్లడించింది. ఎలాగంటే..కరోనా వైరస్‌ వ్యాప్తికి ముందు శిక్షణ కోసం ఇటలీ వెళ్లింది. తాను అక్కడున్నప్పుడు కరోనా కేసులు అంతగా లేవనీ.. అయినా మాస్క్‌ ధరించడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటిస్తూనే శిక్షణ కొనసాగించానని భవాని వెల్లడించింది. అయితే, విమాన ప్రయాణ ఆంక్షలు విధించగానే స్వదేశానికి తిరిగొచ్చి మంచి పని చేశాననీ.. లేదంటే అక్కడే చిక్కుకుపోయేదాన్నని చెప్పుకొచ్చింది. 

Updated Date - 2020-05-13T09:44:09+05:30 IST