కూల్చేశారు..
ABN , First Publish Date - 2020-12-27T09:43:56+05:30 IST
ఓవైపు కీలక ఆటగాళ్లు లేకపోయినా.. మరోవైపు అవమానకర ఓటమి వేధిస్తున్నా .. రెండో టెస్టును టీమిండియా అద్భుతంగా ఆరంభించింది. ఎప్పటిలాగే బౌలర్లు జట్టుకు అండగా నిలుస్తూ వాడి వేడి బౌలింగ్‌తో కంగారూల పనిబట్టారు...

- బుమ్రా, సిరాజ్, అశ్విన్ విజృంభణ
- ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 195
- భారత్ మొదటి ఇన్నింగ్స్ 36/1
- తొలి రోజు మనదే
ఓవైపు కీలక ఆటగాళ్లు లేకపోయినా.. మరోవైపు అవమానకర ఓటమి వేధిస్తున్నా .. రెండో టెస్టును టీమిండియా అద్భుతంగా ఆరంభించింది. ఎప్పటిలాగే బౌలర్లు జట్టుకు అండగా నిలుస్తూ వాడి వేడి బౌలింగ్‌తో కంగారూల పనిబట్టారు. ఎంసీజీలో మొదట బ్యాటింగ్ చేసే జట్టు విజృంభించే ఆనవాయితీ ఉన్నప్పటికీ బుమ్రా, సిరాజ్, అశ్విన్ వంతుల వారీగా వికెట్లు తీస్తూ ఆతిథ్య జట్టును తొలి రోజే ప్యాకప్ చేశారు. ముఖ్యంగా నయా కెప్టెన్ రహానె చక్కటి వ్యూహాలతో.. సమయానుకూలంగా ఫీల్డింగ్, బౌలింగ్‌ను మార్చుతూ ఫలితం రాబట్టాడు. ఇక, ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలంటే రెండోరోజు మన బ్యాట్స్‌మెన్ విశేషంగా రాణించాలి.
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో తొలిరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. స్టార్ పేసర్ బుమ్రా (4/56), స్పిన్నర్ అశ్విన్ (3/35), అరంగేట్ర హీరో సిరాజ్ (2/40) పదునైన బంతులతో మాయ చేశారు. దీంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకు కుప్పకూలింది. లబుషేన్ (48), హెడ్ (38), వేడ్ (30) రాణించారు. జడేజాకు ఓ వికెట్ దక్కింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 11 ఓవర్లలో 36 పరుగులు చేసింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఈ 36 రన్స్‌కే ఆలౌటైన విషయం తెలిసిందే. క్రీజులో శుబ్‌మన్ గిల్ (28 బ్యాటింగ్), పుజార (7 బ్యాటింగ్) ఉన్నారు. ఇక రెండో రోజు తొలి సెషన్‌లో ఆసీస్ పేస్ దాడిని ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తే భారత్‌కు భారీ స్కోరు సాధ్యమవుతుంది.
బుమ్రా ఝలక్‌తో..: టాస్ గెలిచిన ఆసీస్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ చేపట్టింది. కానీ భారీ స్కోరుపై ఆశలు పెట్టుకున్న ఆతిథ్య జట్టును భారత బౌలర్లు నేలకు దించారు. నాలుగో ఓవర్‌లోనే ఓపెనర్ బర్న్స్‌ను బుమ్రా డకౌట్ చేశాడు. మరో ఓపెనర్ వేడ్ మాత్రం దూకుడు కనబరిచాడు. ఫీల్డర్ల మధ్య నుంచి బంతిని బౌండరీకి తరలిస్తూ వన్డే తరహాలో చెలరేగాడు. అయితే కెప్టెన్ రహానె బంతిని అశ్విన్‌కు అందించి ఫలితం రాబట్టాడు. వేడ్ దూకుడుకు తనే అడ్డుకట్ట వేశాడు. అయితే వేడ్ క్యాచ్‌ను అందుకునేందుకు మిడాన్ నుంచి జడేజా.. మిడాఫ్ నుంచి గిల్ ఇద్దరూ పరిగెత్తుకుని వచ్చారు. ఈక్రమంలో ఇద్దరు ఢీకొన్నప్పటికీ బంతిని మాత్రం జడేజా వదల్లేదు. అనంతరం స్మిత్‌ను కూడా అశ్విన్ డకౌట్‌గా పంపగా లంచ్ బ్రేక్ వరకు ఆసీస్ 38/3 స్కోరుతో నిలిచింది.
లబుషేన్, హెడ్ భాగస్వామ్యం: రెండో సెషన్‌లో లబుషేన్, హెడ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. సమన్వయంతో ఆడుతూ, అడపాదడపా బౌండరీలతో స్కోరును పెంచారు. 26 పరుగుల వద్ద అశ్విన్ ఓవర్‌లో లబుషేన్ రివ్యూ కోరి బతికిపోయాడు. కానీ ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీసేందుకు రహానె.. బుమ్రాను ప్రయోగించాడు. 42వ ఓవర్‌లో అతడు హెడ్‌ను అవుట్ చేయడంతో నాలుగో వికెట్‌కు 86 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత అర్ధసెంచరీకి చేరువవుతున్న లబుషేన్‌ను సిరాజ్ తన తొలి వికెట్‌గా వెనక్కి పంపాడు.
చివరి సెషన్‌లో టపటపా: టీ బ్రేక్ తర్వాత కెప్టెన్ పెయిన్ (13), గ్రీన్ (12) రక్షణాత్మకంగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ మరో ఎండ్‌లో సిరాజ్, అశ్విన్, బుమ్రా బెంబేలెత్తించారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆసీ్‌సను కుదురుకోనీయలేదు. ఈసారి జట్టు టెయిలెండర్లు కూడా పోరాడలేకపోయారు. చివర్లో లియాన్ (20) ధాటిగా ఆడాలని చూసినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లోనే ఝలక్ తగిలింది. మయాంక్‌ను పేసర్ స్టార్క్ డకౌట్ చేశాడు. కానీ తొలి మ్యాచ్ ఆడుతున్న గిల్ ధైర్యంగా క్రీజులో నిలిచాడు. బౌండరీతో టెస్టుల్లో ఖాతా తెరిచాడు. అయితే అదే స్కోరు వద్ద ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో లబుషేన్ వదిలేశాడు. ఆ తర్వాత మరో నాలుగు ఫోర్లతో ఆకట్టుకుని రోజును ముగించాడు.

పెయిన్ నాటౌటా..?
మొదటి రోజు ఆటలో ఆసీస్ కెప్టెన్ పెయిన్‌ను థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. అశ్విన్ వేసిన 55వ ఓవర్ చివరి బంతిని యువ ఆటగాడు గ్రీన్ మిడా్‌ఫలోకి ఆడి పెయిన్‌ను సింగిల్ కోసం పిలిచాడు. అయితే కవర్స్‌లో బంతిని ఆపిన ఉమేష్, కీపర్ పంత్‌కు బంతిని విసిరాడు. బంతిని అందుకున్న పంత్ ఆలస్యం చేయకుండా బెయిల్స్‌ను గిరాటేశాడు. భారత్ రనౌట్‌కు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్, టీవీ అంపైర్‌కు నివేదించాడు. పలుమార్లు రీప్లేలు చూసినా బ్యాట్‌ను పెయిన్ క్రీజులో ఉంచినట్టు స్పష్టంకాలేదు. కానీ ఆసీస్‌కు చెందిన థర్డ్‌అంపైర్ పాల్ విల్సన్ పెయిన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీనిపై ఫీల్డ్ అంపైర్‌కు కెప్టెన్ రహానె తన అసంతృప్తిని తెలియజేశాడు. అయితే పెయిన్ ఆ తర్వాత ఎంతోసేపు కొనసాగలేకపోయాడు. 6 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద బతికిపోయిన పెయిన్ మరో 7 రన్స్‌కే అశ్విన్ బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కాగా..పెయిన్ రనౌటయ్యాడని కామెంటేటర్లు వార్న్, ఆకాశ్ చోప్రా స్పష్టంజేయడం గమనార్హం.

అశ్విన్ వర్సెస్ స్మిత్
ఆసీ్‌సతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ అశ్విన్ చెలరేగుతున్నాడు. తొలి రోజు పిచ్‌పై టర్న్, బౌన్స్‌ను రాబడుతూ మూడు వికెట్లతో దెబ్బతీశాడు. తొలి గంటలోనే బౌలింగ్‌కు దిగిన తను నిరాశపర్చలేదు. వేడ్‌ను అవుట్ చేసిన తర్వాత.. ఎంసీజీలో తిరుగులేని స్మిత్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు చేర్చాడు. తొలి టెస్టులోనూ ఈ మాజీ కెప్టెన్ వికెట్‌ను అశ్వినే తీశాడు. ఓవరాల్‌గా స్మిత్‌పై ఐదోసారి ఆధిపత్యం ప్రదర్శించాడు. నిజానికి స్పిన్నర్లను స్మిత్ సులువుగా ఎదుర్కొంటాడు. కానీ అశ్విన్ బంతులను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు. చాలా తక్కువ ఎత్తులో లెగ్ సైడ్‌లో అతడు వేసిన బంతి నేరుగా స్లిప్‌లో పుజారకు చిక్కింది. దీంతో మూడు ఇన్నింగ్స్‌లో స్మిత్ రెండు పరుగులే సాధించాడు.
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; వేడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 30; లబుషేన్ (సి) గిల్ (బి) సిరాజ్ 48; స్మిత్ (సి) పుజార (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రహానె (బి) బుమ్రా 38; గ్రీన్ (ఎల్బీ) సిరాజ్ 12; పెయిన్ (సి) విహారి (బి) అశ్విన్ 13; కమిన్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 9; స్టార్క్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 7; లియాన్ (ఎల్బీ) బుమ్రా 20; హాజెల్‌వుడ్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు:14; మొత్తం: 72.3 ఓవర్లలో 195 ఆలౌట్. వికెట్ల పతనం: 1-10, 2-35, 3-38, 4-124, 5-134, 6-155, 7-155, 8-164, 9-191, 10-195. బౌలింగ్: బుమ్రా 16-4-56-4; ఉమేశ్ యాదవ్ 12-2-39-0; అశ్విన్ 24-7-35-3; జడేజా 5.3-1-15-1; సిరాజ్ 15-4-40-2.
భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ (ఎల్బీ) స్టార్క్ 0; గిల్ (బ్యాటింగ్) 28; పుజార (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం: 11 ఓవర్లలో 36/1. వికెట్ పతనం: 1-0. బౌలింగ్: స్టార్క్ 4-2-14-1; కమిన్స్ 4-1-14-0; హాజెల్‌వుడ్ 2-0-2-0; లియాన్ 1-0-6-0.
