నాన్న కలను నెరవేరుస్తూ..
ABN , First Publish Date - 2020-12-27T09:28:43+05:30 IST
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టీ బ్రేక్ అది.. భారత ఆటగాళ్లంతా పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో కెప్టెన్ రహానె అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సిరాజ్ దగ్గరికి వెళ్లి ‘అందరికన్నా ముందు నువ్వు వెళ్లు..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ టీ బ్రేక్ అది.. భారత ఆటగాళ్లంతా పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో కెప్టెన్ రహానె అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. సిరాజ్ దగ్గరికి వెళ్లి ‘అందరికన్నా ముందు నువ్వు వెళ్లు.. నీ వెనకాల మేమొస్తాం’ అని చెప్పాడు. అదే జరిగింది కూడా. ఇది చాలు.. తొలిరోజు ఆటలో హైదరాబాదీ పేసర్ సిరాజ్ ఎలాంటి బౌలింగ్ చేశాడో.. ఓ అరంగేట్ర ఆటగాడికి ఇంతకన్నా కావాల్సిందేముంది! గతనెలలో తన తండ్రి మరణించగా.. ఆయన చివరి చూపునకు కూడా నోచుకోకుండా జట్టు కోసం ఆస్ట్రేలియాలోనే ఉన్న సిరాజ్‌కు ఇదే తొలి టెస్టు. ఎన్నో కష్టాలకు ఓర్చి తనను క్రికెటర్‌ను చేసిన తండ్రికి ఘనంగా నివాళి అర్పించాలనే ధ్యేయంతో ఉన్న అతడు ఆసీస్ స్టార్ ఆటగాళ్లను బౌన్సర్లతో వణికించాడు. మ్యాచ్ ఆరంభం నుంచే కెప్టెన్ ఎప్పుడు బంతిని ఇస్తాడా? అన్నట్టుగా ఎదురుచూశాడు. 27 ఓవర్ల తర్వాత రెండో సెషన్‌లో బంతి చేతికి వచ్చింది. అంతే.. ఏళ్లుగా ఎదురుచూసిన అవకాశం కావడంతో ప్రాణం పెట్టి బంతులు వేశాడు. ఓ బౌన్సర్‌తో ఆసీస్ టాప్ స్కోరర్ లబుషేన్‌కు హెచ్చరిక పంపాడు. ఆ తర్వాత లెగ్ గల్లీలో ఊరించే బంతితో అతడి వికెట్ తీసి ఘనంగా తన ఎంట్రీని చాటుకున్నాడు. గిల్ ఈ క్యాచ్‌ను డైవ్ చేస్తూ పట్టేశాడు. అదే ఓవర్ చివరి బంతికి కెప్టెన్ పెయిన్ ఎల్బీ కావాల్సి ఉన్నా రివ్యూ కోరి బతికిపోయాడు. ఇక పెయిన్‌తో కలిసి కుదురుకుంటున్న గ్రీన్‌ను సైతం బుల్లెట్‌లాంటి బంతితో ఎల్బీ చేశాడు. 26 ఏళ్ల సిరాజ్‌కు ఇది తొలి టెస్టే అయినా ఆత్మవిశ్వాసంతో బంతులు వేసిన తీరు సహచరులను కూడా ఆకట్టుకుంది. 15 ఓవర్లలో రెండు వికెట్లు తీయడంతో పాటు రెండు క్యాచ్‌లు కూడా పట్టేశాడు. టెస్టు క్యాప్‌ను అందుకోవడం తన జీవితంలో అతిపెద్ద ఘనత అని సిరాజ్ తెలిపాడు. అటు తండ్రి కలను సిరాజ్ నెరవేర్చాడని అతడి కుటుంబసభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు.