ఉత్కంఠపోరులో టీమిండియాదే గెలుపు

ABN , First Publish Date - 2020-12-06T23:04:23+05:30 IST

ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠ నడుమ ఆరు వికెట్ల తేడాతో...

ఉత్కంఠపోరులో టీమిండియాదే గెలుపు

సిడ్నీ: ఆస్ట్రేలియా జట్టుతో సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఉత్కంఠ నడుమ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. కీలకంగా మారిన 20వ ఓవర్లో హార్థిక్ పాండ్యా రెండు సిక్స్‌లతో చెలరేగడంతో రెండు బంతులు మిగిలుండగానే టీమిండియాను విజయం వరించింది. ఈ గెలుపుతో టీ20 సిరీస్‌.. ఒక మ్యాచ్ మిగిలుండగానే టీమిండియా వశమైంది. ఆసీస్ చేతిలో ఓడి వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుని బదులు తీర్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్(30), శిఖర్ ధావన్(52) శుభారంభాన్ని అందించారు. 22 బంతుల్లో 30 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్.. ఆండ్రూ టై బౌలింగ్‌లో స్వెప్‌సన్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. 36 బంతుల్లో రెండు సిక్స్‌లు, నాలుగు ఫోర్లతో 52 పరుగులు చేసి.. హాఫ్ సెంచరీతో రాణించిన ధావన్.. జంపా బౌలింగ్‌లో స్వెప్‌సన్‌కు క్యాచ్‌గా చిక్కి పెవిలియన్ బాట పట్టాడు.


విరాట్ కోహ్లీ 24 బంతుల్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడుతుండగా డేనియల్ శామ్స్ బౌలింగ్‌లో కీపర్ మాథ్యూ వేడ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔటయ్యాడు. సంజూ శాంసన్ 10 బంతుల్లో 15 పరుగులు చేసి.. స్వెప్‌సన్ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించి స్మిత్‌కు క్యాచ్‌గా చిక్కి వెనుదిరిగాడు. అయితే.. టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయిన సందర్భంలో క్రీజులో ఉన్న హార్థిక్ పాండ్యా(42), శ్రేయాస్ అయ్యర్ (12) సమష్టిగా రాణించి టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. 22 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో చెలరేగి బ్యాటింగ్‌లో అద్భుత ఆటతీరు కనబర్చిన హార్థిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఆసీస్ బౌలర్లలో డేనియల్ శామ్స్‌, ఆండ్రూ టై, మిచెల్ స్వెప్‌సన్, జంపాకు తలో వికెట్ దక్కింది.



Updated Date - 2020-12-06T23:04:23+05:30 IST