కంగారెత్తించారు

ABN , First Publish Date - 2020-12-19T06:19:18+05:30 IST

ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబీ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు.

కంగారెత్తించారు

తిప్పేసిన అశ్విన్‌

బెంబేలెత్తించిన బుమ్రా, ఉమేశ్‌

ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 191

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ 9/1


4.1 ఓవర్లు.. 11 పరుగులు.. నాలుగు వికెట్లు. రెండో రోజు తొలి సెషన్‌లో భారత జట్టు ప్రదర్శన ఇది. కేవలం 23 నిమిషాల్లోనే తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించడంతో ఇక టీమిండియాకు కష్టాలు తప్పవని అంతా భావించారు. కానీ సీన్‌ కట్‌ చేస్తే.. అశ్విన్‌ స్పిన్‌ ఉచ్చులో పడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ విలవిల్లాడారు. అలాగే పేసర్లు బుమ్రా, ఉమేశ్‌ పదునైన బంతులకు కూడా వారి దగ్గర సమాధానం లేకుండా పోయింది. వీరి ధాటికి చివరి సెషన్‌లోనే ఆసీస్‌ ఐదు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. తద్వారా రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ ఆధిక్యంలో నిలిచింది.  


అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న గులాబీ టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆటలో భారత బౌలర్లు చెలరేగడంతో ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్‌ అశ్విన్‌ (4/55) విదేశీ పర్యటనలో చిరస్మరణీయ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో శుక్రవారం ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.1 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ (99 బంతుల్లో 10 ఫోర్లతో 73 నాటౌట్‌) పోరాడగా.. లబుషేన్‌ (47) ఫర్వాలేదనిపించాడు. ఉమేశ్‌కు మూడు, బుమ్రాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత 53 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ రెండోరోజు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 6 ఓవర్లలో 9 పరుగులు చేసింది. ఓపెనర్‌ పృథ్వీ షా (4) మరోసారి నిరాశపర్చగా.. క్రీజులో మయాంక్‌ (5 బ్యాటింగ్‌), బుమ్రా (0 బ్యాటింగ్‌) ఉన్నారు. ప్రస్తుతం భారత్‌ 62 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే మూడో రోజు మెరుగైన ప్రదర్శనతో ఆసీస్‌ ముందు 300 వరకు లక్ష్యం ఉంచగలిగితే భారత్‌ ఫలితాన్ని ఆశించవచ్చు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 93.1 ఓవర్లలో 244 పరుగుల వద్ద ముగించింది.


ఇలా వచ్చి అలా..: రెండో రోజు 233/6 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌.. స్టార్క్‌, కమిన్స్‌ ధాటికి 11 పరుగులు మాత్రమే జోడించింది. తొలి ఓవర్‌లోనే అశ్విన్‌ను కమిన్స్‌, రెండో ఓవర్‌లో సాహాను స్టార్క్‌ పెవిలియన్‌కు చేర్చారు. మరో 13 బంతుల్లో మిగిలిన వికెట్లు కూడా నేలకూలడంతో భారత్‌ కథ ముగిసింది. భారత్‌ను త్వరగానే పెవిలియన్‌కు చేర్చిన సంతోషంలో మొదటి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆసీస్‌ను పేసర్‌ బుమ్రా వణికించాడు. అతడి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బంతులకు ఒక్కో పరుగు తీసేందుకు ఓపెనర్లు వేడ్‌ (51 బంతుల్లో 8), బర్న్స్‌ (41 బంతుల్లో 8) కష్టపడ్డారు. అటు షమి, ఉమేశ్‌ కూడా చెలరేగడంతో ఐదో ఓవర్‌లో కానీ ఆసీస్‌ జట్టు పరుగుల ఖాతా తెరవలేకపోయింది. చివరకు ఓపెనర్లను బుమ్రా ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. 


అశ్విన్‌ హవా: లంచ్‌ విరామం తర్వాత స్పిన్నర్‌ అశ్విన్‌ ఆసీస్‌ మిడిలార్డర్‌ పని పట్టాడు.  ఓపిగ్గా క్రీజులో నిలిచిన స్మిత్‌ (29 బంతుల్లో 1)ను తన తొలి స్పెల్‌లోనే అశ్విన్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ సంబరాల్లో మునిగింది. స్వల్ప వ్యవధిలోనే హెడ్‌ (7), గ్రీన్‌ (11) వికెట్లను కూడా అతడు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఆసీస్‌ 79 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో లబుషేన్‌, కెప్టెన్‌ పెయిన్‌ టీ బ్రేక్‌ వరకు మరో వికెట్‌ పడకుండా ఆడారు.


భారత్‌దే ఆధిపత్యం: ఫ్లడ్‌ లైట్ల వెలుతురులో సాగిన చివరి సెషన్‌లో భారత బౌలర్లు చెలరేగి ఐదు వికెట్లు తీశారు. అయితే లబుషేన్‌, పెయిన్‌ ఓపిగ్గా ఆడుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేయడంతో 51.1 ఓవర్లలో స్కోరు వందకు చేరింది. ప్రమాదకరంగా మారుతున్న దశలో లబుషేన్‌ను, కమిన్స్‌ను ఒకే ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ అవుట్‌ చేయడంతో ఆసీ్‌సకు షాక్‌ తగిలింది. ఈ దశలో టెయిలెండర్ల అండతో పెయిన్‌ పోరాటం సాగించాడు. చకచకా బౌండరీలు బాదుతూ 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ మరో ఎండ్‌లో అశ్విన్‌, ఉమేశ్‌ వికెట్లు తీయడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 200లోపే ముగిసింది.


అశ్విన్‌.. తాహిర్‌లా!

దక్షిణాఫ్రికా లెగ్‌ స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ వికెట్‌ తీస్తే ఆ సంబరాలు ఎలా ఉంటాయో తెలిసిందే. భారత ఆఫ్‌ స్పిన్నర్‌ ఆర్‌.అశ్విన్‌ కూడా తొలి టెస్టులో అతడినే అనుకరించాడు. రెండో రోజు ఆటలో కీలక స్మిత్‌ వికెట్‌ తీయగానే పట్టలేని సంతోషంతో అలాగే పరిగెత్తుకుంటూ దాదాపు బౌండరీ రోప్‌ వరకు వెళ్లి రావడం ఆకట్టుకుంది. 


బోరభారత్‌ తొలి ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) స్టార్క్‌ 0; మయాంక్‌ (బి) కమిన్స్‌ 17; పుజార (సి) లబుషేన్‌ (బి) లియాన్‌ 43; కోహ్లీ (రనౌట్‌) 74; రహానె (ఎల్బీ) స్టార్క్‌ 42; విహారి (ఎల్బీ) హాజెల్‌వుడ్‌ 16; సాహా (సి) పెయిన్‌ (బి) స్టార్క్‌ 9; అశ్విన్‌ (సి) పెయిన్‌ (బి) కమిన్స్‌ 15; ఉమేశ్‌ (సి) వేడ్‌ (బి) స్టార్క్‌ 6; బుమ్రా (నాటౌట్‌) 4; షమి (సి) హెడ్‌ (బి) కమిన్స్‌ 0; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 93.1 ఓవర్లలో 244 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-32, 3-100, 4-188, 5-196, 6-206, 7-233, 8-235, 9-240, 10-244. బౌలింగ్‌: స్టార్క్‌ 21-5-53-4; హాజెల్‌వుడ్‌ 20-6-47-1; కమిన్స్‌ 21.1-7-48-3; గ్రీన్‌ 9-2-15-0; లియాన్‌ 21-2-68-1; లబుషేన్‌ 1-0-3-0.


ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) బుమ్రా 8; బర్న్స్‌ (ఎల్బీ) బుమ్రా 8; లబుషేన్‌ (ఎల్బీ) ఉమేశ్‌ 47; స్మిత్‌ (సి) రహానె (బి) అశ్విన్‌ 1; హెడ్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 7; గ్రీన్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 11; పెయిన్‌ (నాటౌట్‌) 73; కమిన్స్‌ (సి) రహానె (బి) ఉమేశ్‌ 0; స్టార్క్‌ (రనౌట్‌) 15; లియాన్‌ (సి) కోహ్లీ (బి) అశ్విన్‌ 10; హాజెల్‌వుడ్‌ (సి) పుజార (బి) ఉమేశ్‌ 8; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 72.1 ఓవర్లలో 191 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-16, 2-29, 3-45, 4-65, 5-79, 6-111, 7-111, 8-139, 9-167, 10-191. బౌలింగ్‌: ఉమేశ్‌ 16.1-5-40-3; బుమ్రా 21-7-52-2; షమి 17-4-41-0; అశ్విన్‌ 18-3-55-4.
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) కమిన్స్‌ 4; మయాంక్‌ (బ్యాటింగ్‌) 5; బుమ్రా (బ్యాటింగ్‌) 0; మొత్తం: 6 ఓవర్లలో 9/1. వికెట్ల పతనం: 1-7. బౌలింగ్‌: మిచెల్‌ స్టార్క్‌ 3-1-3-0; కమిన్స్‌ 3-2-6-1.


డే/నైట్‌ టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించకపోవడం ఆసీ్‌సకు ఇదే తొలిసారి


ఈ శతాబ్దంలో ఆడిన టెస్టుల్లో తొలి పరుగు చేసేందుకు 28 బంతులు ఎదుర్కోవడం ఆసీ్‌సకు ఇదే మొదటిసారి


గత 50 ఇన్నింగ్స్‌లో స్టీవ్‌ స్మిత్‌ (1) తక్కువ స్కోరుకే అవుట్‌ కావడం ఇదే తొలిసారి

Read more