ఊహించినట్టే జరగింది
ABN , First Publish Date - 2020-03-13T10:30:24+05:30 IST
అనుకున్నట్టుగానే జరిగింది.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఉదయం నుంచీ కురిసిన వర్షంతో కనీసం టాస్ వేయడానికి కూడా పరిస్థితి

ధర్మశాలలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే అభిమానులేమో కానీ వరుణుడికే ఎక్కువ ఆసక్తి ఉన్నట్టుంది. ఈసారి కూడా ఠంచనుగా హాజరై కుంభవృష్టి కురిపించాడు. దీంతో కరోనా భయంతో స్టేడియానికి వచ్చిన కొద్దిపాటి ప్రేక్ష కులతో పాటు సొంతగడ్డపై టీమిండియా స్టార్ల దూకుడును వీక్షిద్దామనుకున్న అభిమానులకు కూడా నిరాశే ఎదురైంది. ఇంతకుముందు ఈ జట్ల మధ్య ఇదే వేదికపై జరగాల్సిన టీ20 మ్యాచ్ కూడా ఇలాగే రద్దయింది.
ధర్మశాల: అనుకున్నట్టుగానే జరిగింది.. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన తొలి మ్యాచ్‌పై వరుణుడు నీళ్లు కుమ్మరించాడు. ఉదయం నుంచీ కురిసిన వర్షంతో కనీసం టాస్ వేయడానికి కూడా పరిస్థితి అనుకూలించలేదు. మైదానం పూర్తి చిత్తడిగా మారింది. దీంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. రెండ్రోజులుగా ఇక్కడ వర్షాలు కురుస్తుండడంతో ఈ మ్యాచ్ జరగడం కష్టమేనని భావించారు. గడిచిన ఆరు నెలల్లో ఈ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ రద్దు కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు సెప్టెంబరులో ఈ రెండు జట్ల మధ్య జరగాల్సిన టీ20 మ్యాచ్ కూడా వర్షార్పణమైంది. బుధవారం కురిసిన భారీ వర్షానికి మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అలాగే ఆ రోజు రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. దీంతో మైదానం పరిస్థితి దారుణంగా తయారైంది. అందుకే టాస్ వేయడం కూడా ఆలస్యమైంది. మధ్యాహ్నం 1.15కి పిచ్‌ను పరిశీలించాలని అనుకున్నా వర్షం ఆరంభం కావడంతో సాధ్యం కాలేదు. రెండు గంటలకు కవర్లను తొలగించినా అప్పటికే కవర్లపై నిలిచిన నీటితో ఓ మడుగును తలపించింది. మూడు సూపర్ సాపర్‌లను రంగంలోకి దించినా మైదానం సిద్ధం కాలేదు. తిరిగి మూడు గంటలకు భారీ వర్షం కురవడంతో ఇక ఆశలు వదులుకున్నారు. అటు ప్రతీ నాలుగు నిమిషాలకు ఓ ఓవర్ చొప్పున కోత పడుతుండడంతో కనీసం ‘టీ20’ మ్యాచ్ అయినా వీలవుతుందేమోనని అభిమానులు భావించారు. కానీ సాయంత్రం 6.30 గంటలకు కటాఫ్ సమయం ఉన్నా 5.20కి మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.
కరోనా భయంతో...
దేశంలో విజృంభిస్తున్న కరోనా భయంతో ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు ఇష్టపడలేదు. దీంతో 23 వేల సామర్థ్యం కలిగిన ఈ స్టేడియం ముప్పావు వంతు ఖాళీగానే దర్శనమిచ్చింది. దీనికి తోడు వర్షం వస్తూ.. పోతూ ఉండడంతో రద్దు నిర్ణయానికి ముందే చాలా మంది వెళ్లిపోయారు.