జర్మనీ లాక్‌డౌన్‌లో ఉన్న విశ్వనాథన్ ఆనంద్ కరోనాపై ఏం చెప్పారంటే...
ABN , First Publish Date - 2020-03-23T14:54:27+05:30 IST
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జర్మనీ దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ తాను ఎలా గడుపుతున్నారో, జర్మనీలో కరోనా వ్యాప్తి పరిస్థితులు, ఆంక్షల గురించి మొట్టమొదటిసారి తన అనుభవాలను వెల్లడించారు....

ఫ్రాంక్‌ఫర్ట్ (జర్మనీ): కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జర్మనీ దేశంలో లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ తాను ఎలా గడుపుతున్నారో, జర్మనీలో కరోనా వ్యాప్తి పరిస్థితులు, ఆంక్షల గురించి మొట్టమొదటిసారి తన అనుభవాలను వెల్లడించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జర్మనీ నుంచి విమాన సర్వీసులను భారత్ రద్దు చేసింది. దీంతో ప్రపంచ చెస్ మాంత్రికుడు విశ్వనాథన్ ఆనంద్ జర్మనీలో చిక్కుకు పోయారు.జర్మనీలోని బుండెస్లిగాలో చెస్ టోర్నమెంటులో పాల్గొనేందుకు ఆయన అక్కడకు వెళ్లారు. విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆనంద్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. జర్మనీలో లాక్‌డౌన్ జీవితం గురించి విశ్వనాథన్ అనుభవాలు ఆయన మాటల్లోనే విందాం రండి...
‘‘కొవిడ్-19 వల్ల చెస్ మ్యాచ్‌లు రద్దు చేయడంతో భారతదేశానికి విమానసర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో నా కుటుంబాన్ని ప్రమాదంలో పడేయకుండా ఉండేందుకు ఫ్రాంక్‌ఫర్ట్ నగరంలోని నా అపార్టుమెంట్‌లో ముందుజాగ్రత్త చర్యగా హోంక్వారంటైన్‌లో ఉన్నాను. ఇలా కుటుంబానికి దూరంగా జర్మనీలో లాక్‌డౌన్‌లో ఉండటం నాకు మొట్టమొదటిసారి అసాధారణ అనుభవం. ఈ కష్టసమయంలో నా కుమారుడు అఖిల్, భార్య అరుణతో రోజూ వీడియో ఛాటింగ్ చేస్తూ కొంత ఆనందపడుతున్నాను. నేను యోగా, వ్యాయామాలు చేస్తూ అపార్టుమెంటులోనే ఎక్కువ సమయం గడుపుతున్నాను. జనం గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకుండా సమీపంలోని కిరాణ దుకాణంలోనే సరుకులు తీసుకుంటున్నాను.
అపార్టుమెంటు బ్లాక్ కింద అప్పుడప్పుడు వాకింగ్ చేస్తున్నాను. జర్మనీలో ప్రజలు రెస్టారెంట్లకు కూడా వెళ్లకుండా ఫుడ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తున్నారు. మెడికల్ దుకాణాలు తెరచి ఉన్నాయి. రష్యాలోని ఎకాటెరిన్‌బర్గ్‌లో ప్రస్తుతం జరుగుతున్న చెస్ టోర్నమెంట్ పై వెబ్‌సైట్ కోసం ఆన్‌లైన్ వ్యాఖ్యానం చేస్తూ సాయంత్రం వేళల్లో బిజీగా ఉంటున్నాను. నేను జర్మనీ నుంచి వెబ్‌సైట్ వ్యక్తులతో కనెక్ట్ అయి చెస్ పై వ్యాఖ్యానం చేయడం నాకు కొత్త అనుభవం.
కరోనా వైరస్ కు నివారణ లేనందువల్ల ప్రభుత్వం జారీ చేసిన సలహాలను పాటించడం, సామాజిక దూరాన్ని అమలు చేయడం, సాధ్యమైనంత వరకు ఇంట్లో లోపల ఉండటం, క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం ఒక్కటే మార్గం. జర్మనీ నుంచి ఈ నెల 28వతేదీ వరకు విమాన సర్వీసులను రద్దు చేసినందున తర్వాత విమానాలు పునరుద్ధరిస్తే నేను స్వదేశానికి తిరిగి వస్తాను’’ అంటూ విశ్వనాథన్ ఆనంద్ తన అనుభవాలను వివరించారు.