ఎంత గొప్పగా ఆడినా జట్టులో స్థానం లభించకపోవచ్చు: భారత మాజీ స్పిన్నర్

ABN , First Publish Date - 2020-05-10T00:35:01+05:30 IST

ఆటలో రాణించినంత మాత్రాన జట్టులో స్థానం సుస్థిరంగా ఉంటుందన్న మాట అవాస్తవమని, ఒక్కోసారి ఎంత గొప్పగా...

ఎంత గొప్పగా ఆడినా జట్టులో స్థానం లభించకపోవచ్చు: భారత మాజీ స్పిన్నర్

న్యూఢిల్లీ: ఆటలో రాణించినంత మాత్రాన జట్టులో స్థానం సుస్థిరంగా ఉంటుందన్న మాట అవాస్తవమని, ఒక్కోసారి ఎంత గొప్పగా ఆడినా మళ్లీ జట్టు జెర్సీ ధరించే అవకాశం లభించకపోవచ్చని భారత మాజీ స్పిన్నర్ ప్రజ్క్షాన్ ఓఝా అన్నాడు. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన ఓఝా సెలక్షన్ కమిటీపై అసహనం వ్యక్తం చేశాడు. జట్టులో చోటు లభించకపోతే ఎలా ఉంటుందనే ప్రశ్నపై స్పందించిన ఓఝా.. ‘ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో సెలక్షన్ కమిటీకి, ఆటగాళ్లకు మధ్య కమ్యూనికేషన్ లోపం ఉంటుంది. దానివల్ల జట్టును ప్రకటించే వరకు మనం ఉన్నామో.. లేదో కూడా తెలిసేది కాదు. జట్టును ప్రకటించిన తరువాత మన పేరు ఉంటే  ఉన్నట్లు.. లేదా లేనట్లుగా మనం నిర్ధారించుకోవాలి. అదే నాకు చాలా బాధ కలిగించేది. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు దేశవాళీ మ్యాచ్‌లకు కూడా ఇదే పద్ధతి అమలులో ఉంటుంద’ని  ఓఝా చెప్పుకొచ్చాడు. ఆట మీద దృష్టి పెట్టి సాధన చేసుకుంటూ వెళ్లాల్సిందే కానీ, జట్టులో స్థానం కోసం వేచి చూస్తూ ఉంటే ఎటువంటి లాభం ఉండదని వివరించాడు.


 2009లో శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టిన ఓఝా 24 టెస్టులు ఆడి 113 వికెట్లు తీశాడు. ఆ తరువాత అనేక మ్యాచ్‌లలో చక్కటి ప్రదర్శన చేశాడు. అయితే 2013లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో చివరి సారిగా ఓఝా కనిపించాడు. చివరి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ చెరో 5 వికెట్ల చొప్పున 10 వికెట్లు తీశాడు. అయినప్పటికీ అతడికి ఆ తరువాత భారత జెర్సీ ధరించేందుకు అవకాశం లభించలేదు. జట్టులోకి పునరాగమనం చేసేందుకు ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లు తరచుగా ఆడినప్పటికీ అదృష్టం వరించలేదు. ఈ నేపథ్యంలో 2020లో ఫిబ్రవరిలో ఓఝా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదిలా ఉంటే మాజీ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, ఆశిశ్ నెహ్రాలు కూడా జట్టు ఎంపిక, సెలక్షన్ కమిటీలపై ఇటీవల అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-05-10T00:35:01+05:30 IST