కరోనా ఫాస్ట్ బౌలర్ల ఫాంను దెబ్బతీసింది: ఇర్ఫాన్ పఠాన్
ABN , First Publish Date - 2020-07-19T23:25:47+05:30 IST
లాక్‌డౌన్ కారణంగా దాదాపు 4 నెలల నుంచి క్రికెటర్లంతా ఇళ్లకే పరితమైపోయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా...

న్యూఢిల్లీ: లాక్‌డౌన్ కారణంగా దాదాపు 4 నెలల నుంచి క్రికెటర్లంతా ఇళ్లకే పరితమైపోయిన విషయం తెలిసిందే. దీంతో వారంతా ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరమైపోయారు. ఈ నేపథ్యంలో ఆటగాళ్లంతా తిరిగి మునుపటి ఫాంను సాధించాలంటే కొన్ని వారాల సమయమైనా పడుతుంది. అందులోనూ ఫాస్ట్ బౌలర్ల విషయంలో మరింత సమయం పట్టే అవకాశం ఉందని, మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. పేసర్ల ఫాంపై కరోనా తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ పేస్ బౌలర్ల ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తరువాత భారత్‌లో క్రికెట్ ప్రారంభమయ్యే సమయానికి ఫాస్ట్ బౌలర్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటిని సమర్థవంతంగా ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉండాలని పఠాన్ పేర్కొన్నాడు.
‘సాధారణంగా ఏ దేశ క్రికెట్ జట్టుకైనా కేవలం 2 నుంచి 3 వారాల సెలవు మాత్రమే దొరుకుతుంది. కాని కరోనా కారణంగా ఆటగాళ్లకు 3 నెలల విశ్రాంతి దొరింకింది. ఈ 3 నెలలూ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఆటగాళ్లు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే స్పిన్నర్లు, బ్యాట్స్‌మెన్‌లు 3 వారాల సమయంలో తిరిగి ఫిట్‌నెస్ సాధించగలుగుతారు. కానీ ఫాస్ట్ బౌలర్లు అలాకాదు. ఫాస్ట్ బౌలర్లు 140-150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుంటారు. అలాంటి వారు ఇన్ని నెలలు ఖాళీగా ఉండడంతో శరీరం సహకరించదు. దీంతో ఒక్కసారిగా ప్రాక్టీస్ చేయడంతో గాయాలపాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. అంతేకాకుండా వారు మునుపటి స్థాయిని అందుకునేందుకు కనీసం 4 నుంచి 6 వారాలు అవసరం కావచ్చు. అందువల్ల పేసర్లందరూ జాగ్రత్తగా ఉండాలం’టూ ఇర్ఫాన్ సలహా ఇచ్చారు.
ఇదిలా ఉంటే కరోనా పరిస్థితులు పూర్తిగా చక్కబడనప్పటికీ ఇంగ్లాండ్-విండీస్ జట్లు క్రికెట్‌ను ప్రారంభించేశాయి. తొలి టెస్టులో విండీస్ ఫాస్ట్ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. విండీస్ గెలుపులో ప్రముఖ పాత్ర పోషించారు.