వస్తున్నా.. సరికొత్తగా!

ABN , First Publish Date - 2020-06-22T09:33:10+05:30 IST

ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడనే ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ మళ్లీ క్రికెట్‌ బంతిని పట్టేందుకు ఆత్రుతగా ఉన్నాడు. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధంపై పట్టువదలకుండా కోర్టుల్లో పోరాడిన

వస్తున్నా.. సరికొత్తగా!

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేశాడనే ఆరోపణలపై నిషేధం ఎదుర్కొంటున్న కేరళ స్పీడ్‌స్టర్‌ శ్రీశాంత్‌ మళ్లీ క్రికెట్‌ బంతిని పట్టేందుకు ఆత్రుతగా ఉన్నాడు. బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధంపై పట్టువదలకుండా కోర్టుల్లో పోరాడిన శ్రీ.. చివరకు ఏడేళ్ల వేటుతో బయటపడ్డాడు. ఆ నిషేధం ఈ సెప్టెంబరుతో ముగియనుంది. భారత క్రికెట్‌లో అత్యంత నాణ్యమైన స్వింగ్‌ బౌలర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌ రాక కోసం ఎదురుచూస్తున్నట్టు కేరళ క్రికెట్‌ సంఘం ఇప్పటికే ప్రకటించింది. అందుకే శారీరంగానే కాకుండా మానసికంగానూ ఫిట్‌గా ఉండేందుకు 37 ఏళ్ల ఈ పేసర్‌ ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకోసం దిగ్గజ బాస్కెట్‌బాల్‌ ఆటగాడు మైకేల్‌ జోర్డాన్‌, దివంగత కోబి బ్రయాంట్‌కు ట్రయినర్‌గా వ్యవహరించిన టిమ్‌ గ్రోవర్‌ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నట్టు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్‌ వెల్లడించాడు. ఎన్‌బీఏకు చెందిన ఫిజికల్‌, మానసిక శిక్షణ నిపుణుడైన గ్రోవర్‌ తీసుకునే ఆన్‌లైన్‌ క్లాసుల కోసం తెల్లవారుజాము 5 గంటలకే సిద్ధమవుతున్నానన్నాడు. ‘ఎన్‌బీఏలో గ్రోవర్‌కు మంచి పేరుంది. వారానికి మూడుసార్లు ఉదయం 5.30 నుంచి 8.30 వరకు అతడి క్లాసులకు హాజరవుతున్నా. మానసికంగా దృఢంగా ఉండేందుకు ఆయన సలహాలు తూచ తప్పక పాటిస్తున్నా. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎర్నాకులంలోని ఇండోర్‌ నెట్స్‌లో శ్రమి స్తున్నా. రంజీ ఆటగాడు సచిన్‌ బేబితో పాటు అండర్‌-23 క్రికెటర్లతో కలిసి సాధన చేస్తున్నా’ అని తన రోజువారీ షెడ్యూల్‌ను శ్రీశాంత్‌ వివరించాడు. 


వచ్చే ఏడాది ఐపీఎల్‌లో..

2021 ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో తిరిగి తన పేరును చూసుకోవాలనుకుంటున్నట్టు శ్రీశాంత్‌ తెలిపాడు. దేశవాళీల్లో రాణిస్తే కచ్చితంగా తనను కూడా పరిగణనలోకి తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే కొన్ని జట్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని, అందుకే వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆడగలననే నమ్మకంతో ఉన్నానని చెప్పాడు. 


వన్డే వరల్డ్‌క్‌పలోనూ..

ఐపీఎల్‌లోనే కాకుండా 2023లో జరిగే వన్డే వరల్డ్‌క్‌పలోనూ భారత్‌ తరఫున ఆడతాననే ధీమాను శ్రీ వ్యక్తం చేశాడు. ‘నా వయస్సు అప్పటికి 40 ఏళ్లకు చేరినా వన్డే వరల్డ్‌క్‌పలో చోటు దక్కుతుందని భావిస్తున్నా. నా ఫిట్‌నె్‌సపై ఎలాంటి ఆందోళన లేదు. డిప్రెషన్‌కు లోనవకుండా ఇతర వ్యాపకాలతో  నన్నునేను బిజీగా ఉంచుకుంటున్నా. ఏడేళ్ల విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగడం కష్టమని తెలుసు. కానీ నా పనైపోలేదు. నా బౌలింగ్‌ను మీరంతా మరోసారి చూస్తారు’ అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

Updated Date - 2020-06-22T09:33:10+05:30 IST