ఐపీఎల్ ఎలిమినేటర్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

ABN , First Publish Date - 2020-11-07T00:48:45+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)లో నేడు మరో కీలక మ్యాచ్‌కు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్

ఐపీఎల్ ఎలిమినేటర్.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హైదరాబాద్

అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్-2020)లో నేడు మరో కీలక మ్యాచ్‌కు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరికాసేపట్లో ఎలిమినేటర్ మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ మరోమాటకు తావులేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టనుండగా, గెలిచిన జట్టు ఫైనల్లో అడుగుపెట్టాలంటే మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నిన్న ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైన ఢిల్లీతో తలపడాల్సి ఉంటుంది. ఆ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.


వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న హైదరాబాద్ ఫైనల్‌పై కన్నేసింది. ఆటగాళ్లందరూ మంచి ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం. నిజానికి ఆ జట్టుపై ఎటువంటి ఒత్తిడి లేదు. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సాహా గాయం కారణంగా జట్టుకు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద లోటే. అతడి స్థానంలో గోస్వామి జట్టలోకి వచ్చాడు. 


ఇక, తొలుత అద్భుత విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న కోహ్లీ సేన ఆ తర్వాత ఒక్క మ్యాచ్‌ను గెలుచుకోలేక, చచ్చీచెడీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. వరుస పరాజయాలతో చతికిల పడింది. అయితే, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఐపీఎల్‌లో అందని ద్రాక్షగా మారిన కప్పును చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే, నిలకడలేమి ఆ జట్టును వేధిస్తోంది.


నువ్వా-నేనా అనేలా జరగనున్న నేటి పోరు ప్రేక్షకులకు పసందైన విందు అవుతుందనడంలో సందేహం లేదు. గాయం కారణంగా క్రిస్ మోరిస్ జట్టుకు దూరం కాగా, జోషువా ఫిలిప్‌ను బెంచ్‌కు పరిమితం చేశారు. అరోన్ ఫించ్ జట్టులోకి తిరిగి రాగా, షాబాజ్ అహ్మద్ స్థానంలో సైనీ జట్టులోకి వచ్చాడు. అలాగే, ఆడం జంపాకు కూడా తుది జట్టులో స్థానం లభించింది.

Updated Date - 2020-11-07T00:48:45+05:30 IST