భారీ స్కోరు సాధించిన ముంబై.. హైదరాబాద్ ఎదుట కొండంత లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-04T22:59:41+05:30 IST
హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాలు
షార్జా: హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సవాలు విసిరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 6 పరుగులకే అవుటైనప్పటికీ మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ చెలరేగి ఆడాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
సూర్యకుమార్ యాదవ్ 27, ఇషాన్ కిషన్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. చివర్లో కీరన్ పొలార్డ్ 13 బంతుల్లో 3 సిక్సర్లతో 25, కృనాల్ పాండ్యా 4 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 20 పరుగులు చేయడంతో ముంబై 200 పరుగులు దాటింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, సిద్ధార్ధ్ కౌల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, రషీద్ ఖాన్ ఓ వికెట్ తీసుకున్నాడు.