ఎందుకిలా..?

ABN , First Publish Date - 2020-12-20T06:58:58+05:30 IST

సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆసీ్‌స జట్ల మధ్య డే/నైట్‌ మ్యాచ్‌ అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తొలిరోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడినా.. బౌలర్లు బంతితో మెరిశారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను కంగుతినిపించడంతో భారత్‌ విజయంపై ఆశలు చిగురించాయి. కానీ ఊహించని రీతిలో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఆటతీరు సాగింది. ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేచి టీవీ ఆన్‌ చేసిన వారైతే స్కోరు బోర్డు చూసి షాక్‌ తగిలినట్టు ఫీలయ్యారు...

ఎందుకిలా..?

సూపర్‌ స్టార్లతో కూడిన భారత్‌-ఆసీ్‌స జట్ల మధ్య డే/నైట్‌ మ్యాచ్‌ అనగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక తొలిరోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్‌ తడబడినా.. బౌలర్లు బంతితో మెరిశారు. ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ను కంగుతినిపించడంతో భారత్‌ విజయంపై ఆశలు చిగురించాయి. కానీ ఊహించని రీతిలో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన ఆటతీరు సాగింది. ఉదయం కాస్త ఆలస్యంగా నిద్ర లేచి టీవీ ఆన్‌ చేసిన వారైతే స్కోరు బోర్డు చూసి షాక్‌ తగిలినట్టు ఫీలయ్యారు. ఆట ప్రారంభమైన గంటన్నరలోనే ఏకంగా తొమ్మిది వికెట్లను కోల్పోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. 


ఫీల్డింగ్‌లో నాసిరకం: మైదానంలో భారత ఫీల్డర్లు చురుగ్గా కదలలేకపోతున్నారు. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు క్యాచ్‌లను నేలపాలు చేయడమే దీనికి ఉదాహరణ. ఇందులో మూడైతే మరీ సులువైనవి. క్లబ్‌ క్రికెట్‌కన్నా అథమ స్థాయిలో ఫీల్డింగ్‌ ప్రమాణాలున్నాయనే విమర్శలు వస్తున్నాయి. దీని ఫలితంగానే లబుషేన్‌, పెయిన్‌ చక్కగా కుదురుకున్నారు. 111/7 స్కోరు వద్ద పెయిన్‌ ఇచ్చిన క్యాచ్‌ను మయాంక్‌ వదిలేశాడు. ఆ తర్వాత ఆసీస్‌ కెప్టెన్‌ జట్టు స్కోరును 191 వరకు తీసుకెళ్లాడు. లేకుంటే భారత్‌కు కనీసం 100 పరుగుల ఆధిక్యమైనా లభించేది. 


తుది కూర్పులో గందరగోళం: ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలర్ల ప్రదర్శన ఉత్తమ స్థాయిలో ఉండొచ్చు. కానీ 62 పరుగుల ఆధిక్యంతో మైదానంలోకి వచ్చిన జట్టు ఇలా భంగపడడం దారుణం. ఆసీ్‌సను ఎదుర్కొని క్రీజులో నిలుద్దామనే ఆలోచన ఎవరిలోనూ కనిపించలేదు. బ్యాటింగ్‌లో తీవ్రత లేకపోయింది. అలాగే ఫామ్‌లో లేని పృథ్వీ షాను ఆడించడం చర్చనీయాంశమైంది. గిల్‌ మెరుగ్గా ఆడుతున్నా అనుభవం లేదంటూ బెంచీకి పరిమితం చేయడం శోచనీయం. అలాగే తన ఆటతీరును గణనీయంగా మెరుగుపర్చుకున్న రాహుల్‌కు సైతం జట్టులో చోటు కల్పించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. రెండో టెస్టులో కోహ్లీ కూడా ఉండడు కాబట్టి తుది జట్టులో మార్పులతో పాటు ఫీల్డింగ్‌ ప్రమాణాలు మెరుగైతేనే ఆశించిన ఫలితం ఉంటుంది.


49204084041..ఈ ఓటీపీని త్వరగా మర్చిపోవాలి   -సెహ్వాగ్‌


భారత్‌ బ్యాట్స్‌మెన్‌ అవుటైన తీరుకు వారిని నిందించలేం. ఆస్ట్రేలియా బౌలర్లు అమోఘంగా బౌలింగ్‌ చేశారు.   -గవాస్కర్‌


Updated Date - 2020-12-20T06:58:58+05:30 IST