కపిల్‌దేవ్‌కు గుండెపోటు
ABN , First Publish Date - 2020-10-24T09:21:43+05:30 IST
భారత్‌కు మొట్టమొదటి క్రికెట్ ప్రపంచకప్ అందించిన లెజెండరీ ఆటగాడు, మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నిఖంజ్ (61) గుండెపోటుకు గురయ్యాడు

యాంజియోప్లాస్టీ చేసిన డాక్టర్లు
నిలకడగా పరిస్థితి
ఒకటి రెండు రోజుల్లో డిశ్చార్జి
త్వరగా కోలుకోవాలని క్రీడాలోకం ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత్‌కు మొట్టమొదటి క్రికెట్ ప్రపంచకప్ అందించిన లెజెండరీ ఆటగాడు, మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ నిఖంజ్ (61) గుండెపోటుకు గురయ్యాడు. దాంతో ఇక్కడి ఓ ఆసుపత్రిలో అతనికి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. కపిల్ ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉందని, ఒకట్రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. గురువారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆయన్ను ఆసుపత్రికి తీసుకురాగా, పరీక్షలు నిర్వహించి అత్యవసరంగా కరోనరీ యాంజియోప్లాస్టీ చేశాం. ప్రస్తుతం ఆయన ఐసీయూలో ఉన్నారు. కార్డియాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ అతుల్ మాథుర్ ఆధ్వర్యంలోని వైద్య బృందం కపిల్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది’ అని ఆసుపత్రి విడుదలజేసిన ఆరోగ్య బులెటిన్‌లో వెల్లడించింది. కాగా తొలుత కపిల్‌కు ఛాతీనొప్పి అని మాత్రమే తెలిపిన ఆసుపత్రి వర్గాలు...ఆ తర్వాత గుండెపోటు అని సవ రించాయి. ఇక కపిల్ పరిస్థితి చక్కగా ఉందని, అతడి స్నేహితుడు, భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ) అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా తెలిపాడు.
యాంజియోప్లాస్టీ అంటే..
గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలను ధమనులు అంటారు. కొవ్వు చేరడంవల్ల ఈ ధమనులు పూడుకు పోతాయి. యాంజియోప్లాస్టీ ద్వారా ధమనులను వెడల్పు చేసి గుండెకు రక్తం సాఫీగా సరఫరా అయ్యేలా చేస్తారు. ఇక యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారంటే.. క్యాథటర్ బెలూన్ను తొడ లేదా చేతి రక్తనాళాల ద్వారా గుండె రక్తనాళాలలోకి పంపిస్తారు. పూడుకు పోయినచోటకు చేరగానే క్యాథటర్ బెలూన్‌లోకి గాలిని పంపి కుంచించుకుపోయిన రక్తనాళాన్ని వెడల్పు చేస్తారు. తద్వారా రక్త సరఫరాను మెరుగుపరుస్తారు.
మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు
నేను అనారోగ్యానికి గురయ్యానని తెలిసి ఆందోళన చెంది..సత్వరమే కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు. మీరు చూపిన ప్రేమాభిమానాలతో నేను త్వరగా కోలుకుంటా.
కపిల్