ఇక అఫ్రీదితో కటీఫ్: హర్భజన్
ABN , First Publish Date - 2020-05-18T09:16:37+05:30 IST
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదితో ఇక ఎలాంటి స్నేహ సంబంధాలు ఉండవని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ స్పష్టం చేశాడు. ఇటీవల అఫ్రీది పాక్ ...

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రీదితో ఇక ఎలాంటి స్నేహ సంబంధాలు ఉండవని వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ స్పష్టం చేశాడు. ఇటీవల అఫ్రీది పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పర్యటిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భజ్జీని కూడా విమర్శిస్తున్నారు. ఎందుకంటే హర్భజన్‌కు అఫ్రీదితో మంచి సంబంధాలు ఉండడంతో పాటు అతడి ఫౌండేషన్‌కు విరాళాలు ఇవ్వాలంటూ గతంలో పిలుపునిచ్చాడు. అందుకే భారత్‌ను ద్వేషించే అఫ్రీదికి ఎందుకు మద్దతిస్తున్నావని నిలదీశారు. దీంతో భజ్జీ స్పందిస్తూ.. ‘ఇక అఫ్రీదితో నాకు ఎలాంటి సంబంధాలు ఉండవు. అతడు భారత్ గురించి, ప్రధాని గురించి మాట్లాడిన విధానం నాకు బాధ కలిగించింది. అతడు అడిగితేనే అప్పట్లో విరాళం ఇవ్వాలంటూ మద్దతిచ్చా. దేశంపట్ల నాకున్న అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అవసరమైతే తుపాకీ చేతపట్టి సరిహద్దుల్లో కాపలా ఉండేందుకైనా నేను సిద్ధం’ అని భజ్జీ స్పష్టం చేశాడు. మరోవైపు గతంలో అఫ్రీది ఫౌండేషన్‌కు మద్దతు ప్రకటించిన యువరాజ్ కూడా స్పందించాడు. ‘ప్రధాని మోదీపై అతడు చేసిన వ్యాఖ్యలను భారతీయుడిగా సహించలేను. మానవతా ధృక్పథంతోనే అతడి ఫౌండేషన్‌కు విరాళాలివ్వాలని పిలుపిచ్చా. మరోసారి అలాంటి పనిచేయను’ అని యువీ తేల్చి చెప్పాడు.