అయ్యయ్యో.. చెన్నై!
ABN , First Publish Date - 2020-10-24T09:33:51+05:30 IST
బ్యాటింగ్‌కు స్వర్గధామంలా భావించే షార్జా మైదానంలో ధోనీ సేన విలవిల్లాడింది. అటు బ్యాటింగ్ చేతకాక.. ఇటు బౌలింగ్ సరిగ్గా వేయలేక తాజా

1-0, 2-3, 3-3, 4-3.. ఇవేమీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఇరు జట్ల గోల్స్ అనుకుంటే పొరపాటే.. పేసర్లు బౌల్ట్, బుమ్రా ధాటికి గతమెంతో ఘనకీర్తి కలిగిన చెన్నై జట్టు ఆరంభంలోనే కోల్పోయిన వికెట్లు. ఆ తర్వాత పరిస్థితి మరింత దిగజారి 43/7తో నిలిచింది. ఈ దశలో బెంగళూరు చెత్త పరుగుల (49) రికార్డును కూడా అధిగమిస్తుందేమో అనిపించినా.. సామ్ కర్రాన్ పుణ్యమా అని వంద పరుగులు దాటింది. ఛేదనలో చెన్నై బౌలర్లు పేలవ ప్రదర్శనతో కనీసం ఒక్క వికెట్‌ను కూడా తీయలేకపోయారు. దీంతో ఇషాన్ కిషన్ సూపర్ ఆటతో ముంబై 12.2 ఓవర్లలోనే భారీ విజయాన్నందుకుంది.
114 పరుగులకే ఆలౌట్
10 వికెట్ల తేడాతో ముంబై చేతిలో చిత్తు
దెబ్బతీసిన బౌల్ట్
షార్జా: బ్యాటింగ్‌కు స్వర్గధామంలా భావించే షార్జా మైదానంలో ధోనీ సేన విలవిల్లాడింది. అటు బ్యాటింగ్ చేతకాక.. ఇటు బౌలింగ్ సరిగ్గా వేయలేక తాజా సీజన్ నుంచి సీఎ్‌సకే నిష్క్రమించింది. బౌల్ట్ (4/18) ఐపీఎల్ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో వణికించగా.. ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సూపర్ రన్‌రేట్‌తో ముంబై తిరిగి టాప్‌నకు చేరింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందు గా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. సామ్ కర్రాన్ (47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 52) అర్ధసెంచరీ సాధించాడు. బుమ్రా, రాహుల్ చాహర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో ముంబై 12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి గెలిచింది. డికాక్ (46 నాటౌట్) రాణించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా బౌల్ట్ నిలిచాడు. చెన్నై ఈ మ్యాచ్‌కు రుతురాజ్, జగదీషన్, తాహిర్‌లను జట్టులోకి తీసుకోగా.. రోహిత్ గాయంతో ముంబై కెప్టెన్‌గా పొలార్డ్ వ్యవహరించాడు.
ఇ‘షాన్’ ఇన్నింగ్స్: 115 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఓపెనర్లు ఇషాన్ కిషన్, డికాక్ అవలీలగా లక్ష్యాన్ని చేరుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు వికెట్ల పండగ చేసుకున్న చోట చెన్నై బౌలర్లు మాత్రం ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. తొలి ఓవర్ నుంచే ముంబై పరుగుల వరద పారించింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్ భారీ సిక్సర్లతో కదం తొక్కడంతో ముంబై దూకుడు ఎక్కడా ఆగలేదు. ఐదో ఓవర్లో 4,4,6.. తొమ్మిదో ఓవర్లో రెండు సిక్సర్లతో 29 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అటు రెండేళ్ల తర్వాత జట్టుకు తొలి వికెట్‌కు వంద పరుగుల భాగస్వామ్యాన్ని కూడా అందిస్తూ ఈ జోడీ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించింది. 6, 12 ఓవర్లలో మాత్రమే జట్టు బౌండరీ సాధించలేకపోయింది.
సామ్ కర్రాన్ తెగువ: ఇతర బ్యాట్స్‌మెన్ ఇంతగా భయపడిన పిచ్‌పై సామ్ కర్రాన్ మాత్రం పట్టుదలగా క్రీజులో నిలిచి అర్ధసెంచరీ సాధించాడు. అతడి తెగువ కారణంగా జట్టు 43/7 నుంచి 114/9కి చేరగలిగింది. కర్రాన్‌కు శార్దూల్ (11) కొద్దిసేపు సహకారం అందించగా చెన్నై ఓ ఆరు ఓవర్లపాటు వికెట్ పడకుండా ఆడింది. ఆ తర్వాత తాహిర్ (13 నాటౌట్) అండ లభించడంతో తొమ్మిదో వికెట్‌కు అత్యధికంగా 43 పరుగులు వచ్చాయి. 11-17 ఓవర్ల మధ్య ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో ఒక్క బౌండరీ మాత్రమే వచ్చింది. చివర్లో తాహిర్ రెండు ఫోర్లు సాధించడంతో జట్టు స్కోరు 19వ ఓవర్లో వంద పరుగులు దాటింది. ఆఖరి ఓవర్లో సామ్ చెలరేగి మూడు ఫోర్లు సాధించాడు. చివరి బంతికి అవుటైనా చెన్నై అప్పటికే కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.
వికెట్ల జాతర: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై బ్యాటింగ్ ఆర్డర్‌ను ముంబై బౌలర్లు చిగురుటాకులా వణికించారు. ముఖ్యంగా పేసర్లు బౌల్ట్, బుమ్రా నిప్పులు చెరిగే బంతులకు ప్రత్యర్ధి ఆటగాళ్లు ఆరంభం నుంచే పెవిలియన్‌కు క్యూ కట్టారు. తొలి ఓవర్ ఐదో బంతికే రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ కాగా ఆ తర్వాత రెండో ఓవర్లో బుమ్రా మరింత భయపెట్టాడు. ఫామ్‌లో ఉన్న రాయుడు (2)ను షార్ట్ బాల్స్‌తో బెంబేలెత్తిస్తూ అవుట్ చేయగా తర్వాతి బంతికే జగదీశన్‌ను డకౌట్ చేశాడు. ఇక నిలుస్తాడనుకున్న డుప్లెసి (1)ని బౌల్ట్ తన తర్వాతి ఓవర్లో వెనక్కి పంపాడు. దీంతో కేవలం 3 పరుగులకు 4 వికెట్లు కోల్పోవడంతో చెన్నై ఒత్తిడిలో పడిపోయింది. ఈ సమయంలో నాలుగో ఓవర్లో ధోనీ (16) రెండు ఫోర్లు, జడేజా ఓ ఫోర్ కారణంగా 13 పరుగులు వచ్చాయి. అయితే బౌల్ట్ మరోసారి దెబ్బతీస్తూ జడేజాను కూడా అవుట్ చేయడంతో పవర్‌ప్లేలోనే సీఎ్‌సకే 21/5 స్కోరుతో దీనస్థితిలో పడిపోయింది. ఆదుకుంటాడని ఏమూలో ఆశలున్న ధోనీ కూడా ఏడో ఓవర్లో ఓ సిక్సర్ బాదాక కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్లో చెత్త స్కోరు (49) రికార్డును చెన్నై దాటగలదా? అనిపించింది.
1 ఐపీఎల్లో తొలిసారిగా తొమ్మిదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం (43)అందించిన సామ్ కర్రాన్- తాహిర్ జోడీ.
అతి తక్కువ పరుగు(3)లకే నాలుగు వికెట్లు కోల్పోవడం ఐపీఎల్లో ఇది రెండోసారి.
స్కోరు బోర్డు
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (ఎల్బీ) బౌల్ట్ 0; డుప్లెసి (సి) డికాక్ (బి) బౌల్ట్ 1; రాయుడు (సి) డికాక్ (బి) బుమ్రా 2; జగదీశన్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; ధోనీ (సి) డికాక్ (బి) రాహుల్ చాహర్ 16; జడేజా (సి) క్రునాల్ (బి) బౌల్ట్ 7; సామ్ కర్రాన్ (బి) బౌల్ట్ 52; దీపక్ చాహర్ (స్టంప్డ్) డికాక్ (బి) రాహుల్ చాహర్ 0; శార్దూల్ (సి) సూర్యకుమార్ (బి) కల్టర్‌నైల్ 11; తాహిర్ (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 114/9. వికెట్ల పతనం: 1-0, 2-3, 3-3, 4-3, 5-21, 6-30, 7-43, 8-71, 9-114. బౌలింగ్: బౌల్ట్ 4-1-18-4; బుమ్రా 4-0-25-2; క్రునాల్ 3-0-16-0; రాహుల్ చాహర్ 4-0-22-2; కల్టర్‌నైల్ 4-0-25-1; పొలార్డ్ 1-0-4-0.
ముంబై ఇండియన్స్: క్వింటన్ డికాక్ (నాటౌట్) 46; ఇషాన్ కిషన్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 12.2 ఓవర్లలో 116/0; బౌలింగ్: దీపక్ చాహర్ 4-0-34-0; హాజెల్‌వుడ్ 2-0-17-0; ఇమ్రాన్ తాహిర్ 3-0-22-0; శార్దూల్ ఠాకూర్ 2.2-0-26-0; జడేజా 1-0-15-0.