ఐసీసీ పీఠంపై గ్రెగ్ బార్క్లే
ABN , First Publish Date - 2020-11-26T08:29:05+05:30 IST
ఐసీసీ చైర్మన్ ఎన్నికపై కొన్ని నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. నూతన చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యారు. శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పీఠాన్ని అధిష్టించిన రెండో వ్యక్తిగా గ్రెగ్ నిలిచారు...

దుబాయ్: ఐసీసీ చైర్మన్ ఎన్నికపై కొన్ని నెలలుగా నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. నూతన చైర్మన్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్ బార్క్లే ఎన్నికయ్యారు. శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీ స్వతంత్ర చైర్మన్ పీఠాన్ని అధిష్టించిన రెండో వ్యక్తిగా గ్రెగ్ నిలిచారు. మంగళవారం జరిగిన ఐసీసీ త్రైమాసిక సమావేశం సందర్భంగా జరిగిన ఎలకా్ట్రనిక్ ఓటింగ్ రెండో రౌండ్లో బార్క్లే 11-5తో తాత్కాలిక చైర్మన్, సింగపూర్‌కు చెంది న ఇమ్రాన్ ఖవాజాపై గెలిచారు.
16 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు (12 టెస్ట్ దేశాలు, 3 అనుబంధ దేశాల ప్రతినిధులు, స్వత్రంత మహిళా డైరెక్టర్) ఓటింగ్‌లో పాల్గొన్నారు. కీలకమైన క్రికెట్ సౌతాఫ్రికా ఓటు బార్క్లేకు పడడంతో ఆయన్ను విజయం వరించింది. తొలిరౌండ్ లో బార్క్లేకు 10.. ఖవాజాకు 6 ఓట్లు వచ్చాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం 2/3 వంతు మెజార్టీ అంటే.. 16ఓట్లలో 11 వచ్చిన వారిదే విజయం. కానీ, ఇద్దరికీ తగినంత మెజార్టీ రాకపోవడంతో.. రెండో రౌండ్ ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చింది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బోర్డులు ఆయనకు అనుకూలంగా ఓటు చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఐసీసీ ఈవెంట్ల సంఖ్యను పెంచుతానన్న ఖవాజాకు పాకిస్థాన్ మద్దతుగా నిలిచింది.