ప్రాక్టీస్‌కు సిద్ధం కండి
ABN , First Publish Date - 2020-05-18T09:28:43+05:30 IST
దేశం సోమవారంనుంచి నాలుగో దశ లాక్‌డౌన్‌లో ప్రవేశించింది. ఈనెల 31 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌లో కేంద్ర హోంశాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చింది...

శిక్షణ శిబిరాల పునఃప్రారంభం
స్టేడియాల్లోకి ప్రేక్షకులకు నో ఎంట్రీ
న్యూఢిల్లీ: దేశం సోమవారంనుంచి నాలుగో దశ లాక్‌డౌన్‌లో ప్రవేశించింది. ఈనెల 31 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌లో కేంద్ర హోంశాఖ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. క్రీడారంగానికి సంబంధించి కొన్ని అనుమతులిచ్చింది. ‘క్రీడా సముదాయాలు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. అయితే ప్రేక్షకులను మాత్రం అనుమతించకూడదు’ అని ఆదివారం జారీ చేసిన మార్గదర్శకాల్లో హోంశాఖ సూచించింది. ఫలితంగా.. అర్ధంతరంగా ఆగిపోయిన శిక్షణ శిబిరాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. కరోనా వైర్‌సతో గత మార్చి మధ్యనుంచి లాక్‌డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో దేశంలోని క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) కేంద్రాల్లో ఉన్న అథ్లెట్ల శిక్షణ ఆగిపోయింది. వారంతా ఆయా హాస్టళ్ల గదులకే పరిమితమయ్యారు. తమ శిక్షణకు అనుమతించాలని ముఖ్యంగా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన అథ్లెట్లు డిమాండ్ చేస్తున్నారు. గతవారం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినప్పుడు శిక్షణ విషయాన్ని అథ్లెట్లు ప్రస్తావించారు.
కాగా.. ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్న క్రీడాకారులకు శిక్షణను దశలవారీగా పునఃప్రారంభించనున్నట్టు ఈనెల 3నే మంత్రి ప్రకటించడం గమనార్హం. ఇక కొత్త మార్గదర్శకాలతో నాన్ కాంటాక్ట్ క్రీడలకు సంబంధించిన అథ్లెట్ల శిక్షణ తక్షణమే ప్రారంభం కానుంది. అయితే పూర్తిగా లేదా కొద్దిమేర కాంటాక్టు కలిగివుండే ఆటలకు సంబంధించి శిక్షణ ప్రారంభానికి ప్రభుత్వంనుంచి మరిన్ని మార్గదర్శకాలు రావాల్సి ఉంది. ‘క్రీడా సముదాయాలా లేక శిక్షణ కేంద్రాలను మాత్రమే తెరవాలా.. అన్నదానిపై మాకు స్పష్టత రావాల్సి ఉంది. సాయ్ కేంద్రాల్లోకి సాధారణ ప్రజలకు ఎలాగూ ప్రవేశముండదు. కానీ ప్రతి క్రీడ భిన్నమైనది. అందువల్ల పూర్తి వివరాలకోసం మరో రోజు వేచి చూస్తాం’ అని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా అన్నారు.
ఐపీఎల్‌కు అవకాశం లేనట్టే..
తాజా లాక్‌డౌన్ మార్గదర్శకాల ప్రకారం.. ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహణకూ అవకాశంలేదు. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను కొనసాగించడం, వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండడమే ఇందుకు కారణం.