ఏడు నిమిషాల్లోనే టీమిండియా కోచ్‌గా సెలెక్టయ్యా!

ABN , First Publish Date - 2020-06-16T10:04:27+05:30 IST

కోచింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌కు పెద్దగా ఆసక్తి లేదు.. అందుకోసం దరఖాస్తు కూడా చేయలేదు...

ఏడు నిమిషాల్లోనే టీమిండియా కోచ్‌గా సెలెక్టయ్యా!

న్యూఢిల్లీ: కోచింగ్‌పై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు గ్యారీ కిర్‌స్టన్‌కు పెద్దగా ఆసక్తి లేదు.. అందుకోసం దరఖాస్తు కూడా చేయలేదు. కానీ, 2007లో టీమిండియా కోచ్‌గా నియమితుడయ్యాడు. అయితే, అదంతా కేవలం 7 నిమిషాల్లోనే జరిగిపోయిందని నాటి సంఘటనను కిర్‌స్టన్‌ గుర్తు చేసుకున్నాడు. ‘టీమిండియా కోచ్‌ పోస్టుకు నిన్ను పరిగణించవచ్చా? అని అడుగుతూ సెలె క్షన్‌ ప్యానెల్‌లోని గవాస్కర్‌ నాకు మెయిల్‌ పంపాడు. అతను పరిహాసమాడుతున్నాడనుకొని నేను తిరుగు జవాబివ్వలేదు. ఆ తర్వాత ఇంటర్వ్యూకు రమ్మని మరో మెయిల్‌ రావడంతో భారత్‌ వెళ్లా. ఇంటర్వ్యూలో భారత భవిష్యత్‌ క్రికెట్‌ గురించి మీ విజన్‌ ఏంటి? అని అడిగారు. నాకైతే ఏమీ లేవు. ఇలా సిద్ధం కావాలని ఎవరూ చెప్పలేదు. వచ్చింది కూడా ఇప్పుడే అని చెప్పా. అయితే, టీమిండియాను ఓడించడానికి సౌతాఫ్రికా టీమ్‌కు చెందినవాడిగా నీవేం చేస్తావు? అని ప్రశ్నించారు. దీనికి నేను చెప్పిన సమాధానంతో ప్యానెల్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఏడు నిమిషాల్లోపే నా కాంట్రాక్టు ఒప్పందం అంతా జరిగిపోయింది’ అని కిర్‌స్టన్‌ చెప్పుకొచ్చాడు. కిర్‌స్టన్‌ హయాంలో భారత్‌ టెస్ట్‌ల్లో నెం.1 కావడంతోపాటు 2011లో విశ్వవిజేతగా నిలిచింది. 

Updated Date - 2020-06-16T10:04:27+05:30 IST