కరోనా కల్లోలం.. ఆటలు ఆగమాగం
ABN , First Publish Date - 2020-03-13T10:41:10+05:30 IST
‘కొవిడ్-19’ మహమ్మారి క్రీడలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ వైర్‌సతో రద్దవుతున్న, వాయిదా పడుతున్న టోర్నీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలు ప్రేక్షకుల్లేకుండానే

యూఈఎఫ్ఈ చాంపియన్స్ లీగ్‌లో పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎ్‌సజీ) 2-1 తేడాతో బొరూసియా డార్ట్‌మండ్‌పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది. అయితే, ఈ మ్యాచ్ ఖాళీ స్టేడియంలో జరగ్గా బయట పీఎ్‌సజీ అభిమానులు బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు.
న్యూఢిల్లీ: ‘కొవిడ్-19’ మహమ్మారి క్రీడలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ వైర్‌సతో రద్దవుతున్న, వాయిదా పడుతున్న టోర్నీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మిగిలిన రెండు వన్డేలు ప్రేక్షకుల్లేకుండానే జరగనున్నాయి. ఇక వేసవి మెగా టోర్నీ ఐపీఎల్ జరుగుతుందా? లేదా? అనే చర్చ ఊపందుకుంది. వేల కోట్ల రూపాయల వ్యాపారంతో ముడిపడివున్న ఈ టోర్నమెంట్‌పై నిర్ణయం తీసుకొనే విషయంలో క్రీడామంత్రిత్వ శాఖ, బీసీసీఐ ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కన్పిస్తోంది. ఈ 13వ సీజన్ ఐపీఎల్‌ను కొనసాగించాలనే కేంద్ర క్రీడా మంత్రిత్వ భావిస్తోంది. అయితే ఖాళీ స్టేడియాలకే పరిమితం చేయాలని అనుకుంటోంది. ఈమేరకు బీసీసీఐకి సంకేతాలిచ్చింది.
ఐపీఎల్‌పై ఉత్కంఠ
ఐపీఎల్ పాలక మండలి శనివారం సమావేశం కానుంది. టోర్నీ విషయమై ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఈనెల 29న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌కు తెరలేవనుంది. ఐపీఎల్‌లో కీలకమైన విదేశీ క్రికెటర్లు ఏప్రిల్ 15వరకు అందుబాటులో ఉండబోరు. కరోనా వ్యాప్తిని నిరోఽధించేందుకు కేంద్ర ప్రభుత్వం వీసాలను సస్పెండ్ చేసింది. దాంతో వచ్చేనెల 15 తర్వాతే వారు భారత్‌కు వచ్చే అవకాశముంది. కాగా ప్రేక్షకుల్లేకుండా ఐపీఎల్ నిర్వహించాలని యోచిస్తున్నా..దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో టోర్నమెంట్‌ను వాయిదా వేసే అవకాశాలనూ కొట్టిపారేయలేమని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
ఐపీఎల్ నిర్వహణపై విదేశీ వ్యవహారాల శాఖ కూడా ఆందోళన వ్యక్తంజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో టోర్నమెంట్‌ను జరపకపోవడమే ఉత్తమమని పాలక మండలికి సూచించింది.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ వాయిదా..
దిగ్గజ ఆటగాళ్లు సచిన్, లారా, సెహ్వాగ్ లాంటి వారు బరిలోకి దిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీ్‌సపై కరోనా కాటుపడింది. మహారాష్ట్రలో రోజురోజుకూ వైరస్ బాధిత కేసులు పెరుగుతుండడంతో ఈ సిరీ్‌సను అర్ధంతరంగా వాయిదావేశారు.
ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలి
దేశంలో కరోనా బాధితుల సంఖ్య 73 దాటింది. దాంతో ఆరోగ్య శాఖ పలు జాగ్రత్తలు చేపట్టింది. ఆరోగ్య శాఖ సూచనలు, సలహాలను కచ్చితంగా పాటించాలని బీసీసీఐ సహా దేశంలోని అన్ని క్రీడా సమాఖ్య (ఎన్‌ఎ్‌సఎ్‌ఫ)లను క్రీడా శాఖ ఆదేశించింది.
ఎన్‌బీఏ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్
బాస్కెట్‌బాల్ ఎన్‌బీఏపైనా కరోనా పంజా విసిరింది. హుటాన్ జార్జ్ టీమ్‌కు చెందిన డొనో వాల్ మిచెల్, రుఢి గోబర్ట్ అనే ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ సీజన్‌ను ఎన్‌బీఏ సస్పెండ్ చేసింది.
ఆశ్చర్యంగా ఉంది: హామిల్టన్
కొవిడ్-19 మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుండగా తాను ఇక్కడ ఎఫ్1 రేస్ కోసం రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని వరల్డ్ చాంపియన్ లూయిస్ హామిల్టన్ అన్నాడు. ‘షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఈ రేసులో పాల్గొనడం నాకు గొప్పగా ఏమీ అనిపించడం లేదు. అసలు మనమంతా ఈ గదిలో ఉండడమే షాకింగ్‌గా ఉంది. ఎన్‌బీఏ తమ మ్యాచ్‌లను సస్పెండ్ చేసింది కానీ ఎఫ్1 మాత్రం కొనసాగుతోంది’ అని అన్నాడు.
చివరి రెండు వన్డేలు ఖాళీ స్టేడియాల్లో...
భారత్-దక్షిణాఫ్రికా జ ట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండా నిర్వహించ నున్నారు. లఖ్‌నవ్ (మార్చి 15), కోల్‌కతా (18)లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ ప్రేక్షకుడికి కరోనా
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ నెల 8న మెల్‌బోర్న్‌లో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు హాజరైన అభిమాని ఒకరికి కరోనా సోకిందన్న వార్త రెండు దేశాల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. ఆ మ్యాచ్‌ను 86 వేలమందికిపైగా తిలకించిన విషయం విదితమే. ‘మ్యాచ్‌కు హాజరైన ఓ ప్రేక్షకుడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయిందని ఆరోగ్య, మానవ సేవల శాఖ మాకు తెలిపింది. ఉత్తర స్టాండ్ రెండో వరుసలోని ఎన్-42 సీటులో ఆ ప్రేక్షకుడు కూర్చున్నాడ’ని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) యాజమాన్యం గురువారం తెలిపింది.
ఇటలీ ఫుట్‌బాలర్‌కు కరోనా: యువెంటస్, ఇటలీ ఫుట్‌బాలర్ డేనియెల్ రుగానీ కరోనా బారినపడ్డాడు. పరీక్షల్లో రుగానీకి కరోనా పాజిటివ్‌గా తేలిందని యువెంటస్ తెలిపింది. వ్యాధి లక్షణాలు బయటపడడంతో అతడు కలసిన అందరినీ ఐసోలేషన్‌లో ఉంచనున్నట్టు చెప్పింది.
ప్రేక్షకులు లేకుండా పీఎస్‌ఎల్
పాకిస్థాన్ సూపర్‌లీగ్ లీగ్ (పీ ఎస్ఎల్)లో మిగిలిన అన్ని మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాల ని ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. మరోవైపు ఈనెలలో బంగ్లాదేశ్‌తో తమదేశంలో జరగాల్సిన సిరీ్‌సపై రాబోయే 24 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని బోర్డు తెలిపింది.
ఫార్ములావన్‌కూ బ్రేక్ ?: ఫార్ములావన్‌పైనా నీలినీడలు కమ్ముకొంటున్నాయి. ఇప్పటికే చైనాలో జరగాల్సిన సీజన్ ఆరంభ రేస్ రద్దయింది. తాజాగా ఈ ఆదివారం జరగాల్సిన ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రీకి అంతా సిద్ధమవుతుండగా.. తాము వైదొలుగుతున్నట్టు టీమ్ మెక్‌లారెన్ ప్రకటించింది. తమ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. మెక్‌లారెన్ నిర్ణయంతో ఇతర జట్లు ఎలా వ్యవహరిస్తాయన్న ఆసక్తి వ్యక్తమవుతోంది.
మియామి ఓపెన్ రద్దు: కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రతిష్ఠాత్మక ఏటీపీ, డబ్ల్యూటీఏ మియామి ఓపెన్‌ను రద్దు చేశారు. ఇప్పటికే ఇండియన్ వెల్స్ టోర్నీ కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఆరు వారాలపాటు ఎలాంటి టెన్నిస్ టోర్నీలు జరగవని ఏటీపీ ప్రకటించింది.