ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌కు కైఫ్ కౌంటర్

ABN , First Publish Date - 2020-05-17T22:24:18+05:30 IST

భారత క్రికెట్ చరిత్రలో 2002 నాట్‌వెస్ట్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓ మరపురాని...

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌కు కైఫ్ కౌంటర్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో 2002 నాట్‌వెస్ట్‌లో భాగంగా ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఓ మరపురాని జ్ఞాపకం. సచిన్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలందరూ ముందుగానే అవుటై జట్టు అత్యంత కష్ట కాలంలో ఉన్నప్పుడు ఇద్దరు కుర్రాళ్లు పోరాడి ప్రత్యర్థిని ఓడించారు. 326 పరుగుల భారీ లక్ష్యం ముందున్నా ఏ మాత్రం తడబడకుండా విజయం సాధించారు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ నాసిర్ హుస్సేన్. ఇటీవల ఓ టీవీ చానల్‌ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న  నాసిర్ ఆ మ్యాచ్ అనుభవాలను పంచుకున్నాడు. భారీ స్కోరును భారత్ ముందు ఉంచడమే కాకుండా, సచిన్, సెహ్వాగ్ వంటి మేటి ఆటగాళ్లను ఐదుగురిని అప్పటికే పెవిలియన్‌కు పంపించామని, ఇక విజయం తమదే అని నిశ్చయించుకున్నామని చెప్పాడు. ‘‘అప్పుడే కైఫ్ క్రీజ్‌లోకి వచ్చాడు. అతడిని చూడగానే.. మా జట్టు సభ్యుడు ఎవరో ‘ఇతడెవరు..?’ అన్నాడు. దానికి సమాధానంగా నేను ‘సచిన్ బస్ డ్రైవరేమో..’ అని స్లెండ్జింగ్ చేశా. అయితే ఆ తరువాత యువరాజ్‌తో కలిసి ఆట స్వరూపాన్నే మార్చేశాడు కైఫ్.


చివరిగా విన్నింగ్ షాట్ కొట్టి నా వైపు చూశాడు. అతడి చూపులో ‘బస్ డ్రైవర్ బాగా ఆడాడు కదా..?’ అనే అర్థం నాకు కనపడింది’’ అంటూ నాసిన్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే నాసిర్ ఈ విషయాన్ని చెప్పిన ఆడియో క్లిప్పింగ్‌ను తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేసిన మహమ్మద్ కైఫ్ అతడికి కౌంటర్ ఇచ్చాడు. ఆ ఇన్నింగ్స్ మరపురానిదని, దాని వల్లే ఈ బస్ డ్రైవర్‌కు ఇంత గుర్తింపు వచ్చిందని, అందుకు ఆ ఇన్నింగ్స్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలని ట్వీట్ చేశాడు.

Updated Date - 2020-05-17T22:24:18+05:30 IST