అప్పటికీ.. ఇప్పటికీ పంత్‌లో అదే తేడా..: మహ్మద్ కైఫ్

ABN , First Publish Date - 2020-07-15T00:34:31+05:30 IST

గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో తరచుగా వినిపిస్తున్న పేరు రిషబ్ పంత్. కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ధోనీ వారసుడిగా...

అప్పటికీ.. ఇప్పటికీ పంత్‌లో అదే తేడా..: మహ్మద్ కైఫ్

న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా భారత క్రికెట్‌లో తరచుగా వినిపిస్తున్న పేరు రిషబ్ పంత్. కీపింగ్‌లో, బ్యాటింగ్‌లో ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆ తరువాత తన ఫామ్‌ను కొనసాగించలేక జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. ప్రపంచకప్ లాంటి టోర్నీలో పేరున్నప్పటికీ తుది జట్టులో మాత్రం స్థానం సంపాదించుకోలేకపోయాడు. ఒకప్పుడు ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున ఆడిన పంత్ చక్కటి ఆటతో జట్టు విజయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. అలాంటి పంత్ జాతీయ జట్టులో మాత్రం స్థానం లభించినా నిలబెట్టుకోలేకపోయాడు. అయితే దీనిపై మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ మహ్మద్ కైఫ్ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో కైఫ్ మాట్లాడుతూ, ఢిల్లీ జట్టు తరపున ఆడిన పంత్‌కు, జాతీయ జట్టుకు ఆడిన పంత్‌కు గల తేడాలను వివరించాడు. ‘పంత్ స్వేచ్ఛగా ఆడడానికి ఇష్టపడతాడు. మొదటి బంతి నుంచే భారీ షాట్లు ఆడగల బ్యాట్స్‌మెన్. అయితే సింగల్స్ తీయాలా.. డిఫెన్స్ చేసుకోవాలా.. షాట్లు ఆడాలా అనే విషయాలపై అతడు ఆలోచించలేడు.


ఓ స్థిరమైన స్థానంలో, నిర్దిష్టమైన ఓవర్లు ఉండగా మాత్రమే అతడు బ్యాటింగ్ చేయగలుగుతాడు.అందుకే నేను, గంగూలీ, పాంటింగ్ దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాం. పంత్‌ను 3వ స్థానంలో ఆడించాలా.. లేదా 4వ స్థానంలో ఆడించాలా అనే విషయాలపై తర్జన భర్జన పడ్డాం. అయితే చివరికి ఓ నిర్ణయానికి వచ్చాం. పంత్ ఏ స్థానంలో ఆడినా కనీసం 60 బంతులు ఆడేలా ప్రణాళిక రచించాం.


దాంతో అతడు ప్రతి మ్యాచ్‌లో రాణించగలిగాడు. కానీ జాతీయ జట్టు మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. దీంతో పంత్‌ ఫామ్‌పై ప్రభావం పడింది. జట్టులో కూడా స్థానం కోల్పోవాల్సి వచ్చింది’ అంటూ కైఫ్ చెప్పుకొచ్చారు. పంత్‌ రాణించాలంటే ఏం చేయాలో తాము గుర్తించినట్లు జాతీయ జట్టు ఇంకా గుర్తించలేదని, అందుకే పంత్ జట్టులో కుదురుకోలేకపోతున్నాడని కైఫ్ తెలిపారు.

Updated Date - 2020-07-15T00:34:31+05:30 IST