ఆ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మధురం

ABN , First Publish Date - 2020-04-12T10:07:52+05:30 IST

‘నా 30 అంతర్జాతీయ శతకాలలో 10-12 మాత్రమే గుర్తుంటాయి. అందులో న్యూజిలాండ్‌పై సునామీ ఇన్నింగ్స్‌ 31 ఏళ్ల తర్వాతా నా మదిలో ...

ఆ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ మధురం

న్యూఢిల్లీ: ‘నా 30 అంతర్జాతీయ శతకాలలో 10-12 మాత్రమే గుర్తుంటాయి. అందులో న్యూజిలాండ్‌పై సునామీ ఇన్నింగ్స్‌ 31 ఏళ్ల తర్వాతా నా మదిలో మెదులుతూనే ఉంది’ అని టీమిండియా మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌ చెప్పాడు. ఆ రోజు ఇన్నింగ్స్‌లో తనకు పరిస్థితులన్నీ అనుకూలించాయని తెలిపాడు. 1988 డిసెంబరు 17న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సలో భాగంగా జరిగిన ఆ నాలుగో వన్డేలో అజర్‌ (65 బంతుల్లో 108 నాటౌట్‌) ఆకాశమేహద్దుగా చెలరేగి 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.


కివీస్‌ బౌలర్లను ఊతకోత కోస్తూ చేసిన 100 రన్స్‌ అప్పట్లో వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ కావడం విశేషం. ఆ మ్యాచ్‌ దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారమైనా దానికి సంబంధించి ఫుటేజ్‌ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఆ రోజుల్లో దూరదర్శన్‌లో తరచూ లింక్‌ కట్‌ అవుతుండేది. భారత్‌ చేజింగ్‌లో అజర్‌ బ్యాటింగ్‌ సమయంలో అదే చోటు చేసుకుంది. దాంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఆ అద్భుత ఇన్నింగ్స్‌ చూసే అవకాశం దక్కలేదు. ఆ క్షణాలను అజర్‌ గుర్తు చేసుకుంటూ.. ‘వడోదరలోని మోతీబాగ్‌ ప్యాలెస్‌ గ్రౌండ్‌లో ఆ మ్యాచ్‌ జరిగింది. ఎండ తగలకుండా ప్రేక్షకులకోసం షామియానాలు వేశారు. ఆ మ్యాచ్‌లో మూడో నాలుగో సిక్సర్లు కొట్టా. వాటిలో రెండు గ్రౌండ్‌ బయటకు వెళ్లాయి. ఒకటేమో చెట్టుకు తగిలింది. ఆ రోజు తప్పులకు తావులేని విధంగా నా బ్యాటింగ్‌ సాగింది.


60 బంతుల్లోనే సెంచరీ చేశాననే విషయం నాకు కూడా తెలియలేదు’ అని అజర్‌ అన్నాడు. కపిల్‌దేవ్‌లేని ఆ మ్యాచ్‌లో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సంజీవ్‌ శర్మ (10 ఓవర్లలో 74), రషీద్‌ పటేల్‌ (10 ఓవర్లలో 58), చేతన్‌ శర్మ (10 ఓవర్లలో 1/54) ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ‘నాడు 279 రన్స్‌ చేజ్‌ చేయడమంటే ఇప్పట్లో 340 పరుగులంత. ఆరోజు నేను ఆరో నెంబర్‌లో బ్యాటింగ్‌ చేయడం కలిసి వచ్చింది. సరిగ్గా గుర్తులేదు కానీ దిలీప్‌ భాయ్‌ (వెంగ్‌సర్కార్‌) లేదా సంజయ్‌ మంజ్రేకర్‌ అవుటయ్యాకో నేను క్రీజులోకి వచ్చా. అజయ్‌ శర్మ చక్కటి సహకారం అందించాడు. మేం వేగంగా 100 పరుగులకుపైగా భాగస్వామ్యం నెలకొల్పాం’ అని 57 ఏళ్ల అజర్‌ చెప్పాడు. ఆ సిరీ్‌సను వెంగ్‌సర్కార్‌ కెప్టెన్సీలోని భారత్‌ 4-0తో నెగ్గింది. 

Updated Date - 2020-04-12T10:07:52+05:30 IST