సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్ ఫవాద్ ఆలం.. మీడియాపై చిందులు

ABN , First Publish Date - 2020-10-31T22:29:25+05:30 IST

మైదానంలో చాలా కూల్‌గా కనిపించే పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలం మీడియా సమావేశంలో మాత్రం సహనం కోల్పోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో

సహనం కోల్పోయిన పాక్ క్రికెటర్ ఫవాద్ ఆలం.. మీడియాపై చిందులు

కరాచీ: మైదానంలో చాలా కూల్‌గా కనిపించే పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఫవాద్ ఆలం మీడియా సమావేశంలో మాత్రం సహనం కోల్పోయాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడి పేలవ ఫామ్‌ను గుర్తు చేస్తూ దేశవాళీ క్రికెట్‌లోని ప్రదర్శన అంతర్జాతీయ మ్యాచుల్లో కనిపించడం లేదెందుకన్న విలేకరి ప్రశ్నతో ఊగిపోయిన ఫవాద్ ఆలం సహనం కోల్పోయాడు. దశాబ్దం విరామం తర్వాత ఫవాద్ ఇటీవలే పాక్ టెస్టు జట్టులో తిరిగి చోటు సంపాదించాడు. ఇంగ్లండ్ పర్యటనలో అతడికి చోటు కల్పించారు. ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌తో ఆడడానికి ముందు చివరిసారి 2009లో టెస్టు మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లోకి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఏడాది జులై సెంచరీ చేసిన ఫవాద్‌కు వన్డే జట్టులోనూ చోటు లభించింది. 


జట్టు నుంచి పక్కన పెట్టడానికి ముందు ఫవాద్ 2010-2015 మధ్య 38 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. జట్టు నుంచి పక్కన ఉన్న కాలంలో దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేశాడు. దీంతో తిరిగి అనూహ్యంగా జాతీయ జట్టులో చోటు లభించింది. అయితే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఓ మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు. అలాగే, మొత్తం 21 పరుగులు మాత్రమే చేశాడు. 


ముందు నువ్వు తేల్చుకో..

తాజాగా మీడియా సమావేశంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నతో ఫవాద్ చిర్రెత్తిపోయాడు. ‘‘పాకిస్థాన్‌కు ఆడుతున్నప్పుడు మీలో ఆ ఫైర్ కనిపించడం లేదు. ఎందుకు? అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఎందుకంత ఉదాసీనత’’ అని ప్రశ్నించాడు. అక్కడితో ఆగక ‘‘డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా ఆడడంతో అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడే అవకాశం లభించింది. కానీ దేశవాళీ క్రికెట్‌లో చూపిన ప్రదర్శన, ఆ ఫైర్.. టెస్టుల్లోకి వచ్చే సరికి మిస్సవుతోంది కారణం ఏంటి? దేశవాళీ ఆటగాడిగానే మిగిలిపోవాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించాడు.  


విలేకరి ప్రశ్నకు ఫవాద్ ఘాటుగా స్పందించాడు. ‘‘అంటే నేను డొమెస్టిక్ క్రికెట్‌కే పరిమితం కావాలని చెబుతున్నావా?’’ అని ఎదురు ప్రశ్నించాడు. స్పందించిన విలేకరి.. అది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని స్పష్టం చేశాడు. దీంతో ఫవాద్ అతడి వంక కోపంగా చూశాడు. అతడి సమాధానానికి సంతృప్తి చెందని ఫవాద్.. ‘‘ఆ మాట ప్రజలు అంటున్నారా? లేక, నువ్వా? అనేది తొలుత తేల్చుకో’’ అని ఆగ్రహంతో ఊగిపోయాడు. దీంతో పీసీబీ అధికారులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

Read more