ఒక్క బంతీ పడకుండానే..

ABN , First Publish Date - 2020-07-28T08:21:39+05:30 IST

నాలుగో రోజు ఆటలో పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 500 వికెట్ల మైలురాయితో పాటు విజ్డెన్‌ ట్రోఫీని

ఒక్క బంతీ పడకుండానే..

  • నాలుగో రోజు ఆట వర్షార్పణం
  • ఇంగ్లండ్‌-విండీస్‌ మూడో టెస్టు


మాంచెస్టర్‌: నాలుగో రోజు ఆటలో పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 500 వికెట్ల మైలురాయితో పాటు విజ్డెన్‌ ట్రోఫీని అందుకోవాలని పరితపించిన ఇంగ్లండ్‌పై వరుణుడు నీళ్లు చల్లాడు. వెస్టిండీ్‌సతో జరుగుతున్న ఈ మూడో టెస్టును ఒక రోజు ముందుగానే గెలుద్దామనుకున్న ఆతిథ్య జట్టు ఇక చివరి రోజు వరకు వేచిచూడాల్సిందే. సోమవారం భారీ వర్షం కారణంగా మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా పడలేదు. ఆటగాళ్లంతా పెవిలియన్‌కే పరిమితం కాగా.. అటు విండీస్‌ మాత్రం ఊపిరిపీల్చుకుంది. మూడో రోజు ఆదివారం 399 పరుగుల లక్ష్యం కోసం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కరీబియన్‌ జట్టు 6 ఓవర్లలో 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఉదయం నుంచే వర్షం కురుస్తుండడంతో తొలి రెండు సెషన్లు వర్షార్పణమైంది. వరుణుడు కాసేపు తెరిపినిచ్చినా మైదానం చిత్తడిగా మారిపోవడంతో ఆటకు వీలు కాని పరిస్థితి నెలకొంది. దీంతో టీ బ్రేక్‌ తర్వాత కాసేపటికే అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, చివరి రోజు మంగళవారం వాతావరణం మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. దీంతో ఇంగ్లండ్‌ మిగిలిన 8 వికెట్లను నేల కూలుస్తుందా.. లేక విండీస్‌ పోరాడి డ్రా చేసుకుంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Updated Date - 2020-07-28T08:21:39+05:30 IST