ఇక లాంఛనమే..
ABN , First Publish Date - 2020-07-27T08:57:01+05:30 IST
వెస్టిండీ్‌సతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం ఇక లాంఛనమే కానుంది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (6/31, 2/8) నిప్పులు చెరిగే బంతులతో విండీస్ పతనాన్ని శాసిస్తున్నాడు. 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్

- చెలరేగిన పేసర్ బ్రాడ్
- విండీస్ లక్ష్యం 399
- ప్రస్తుతం 10/2
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ 226/2 డిక్లేర్డ్
మాంచెస్టర్: వెస్టిండీ్‌సతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ విజయం ఇక లాంఛనమే కానుంది. పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (6/31, 2/8) నిప్పులు చెరిగే బంతులతో విండీస్ పతనాన్ని శాసిస్తున్నాడు. 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టు ఆదివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసి కష్టాల్లో పడింది. ఈ రెండు వికెట్లను బ్రాడ్ తీశాడు. దీంతో టెస్టుల్లో బ్రాడ్ వికెట్ల సంఖ్య 499కి చేరింది. ప్రస్తుతం క్రీజులో బ్రాత్‌వైట్ (2), హోప్ (4) ఉండగా విజయానికి ఇంకా 389 పరుగుల దూరంలో ఉంది. మ్యాచ్‌కు ఇంకా రెండు రోజుల సమయం ఉండగా విండీస్ ఆశలన్నీ ఇక వరుణుడి మీదే ఉన్నాయు. అంతకుముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో చెలరేగి 58 ఓవర్లలో 2 వికెట్లకు 226 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య జట్టుకు 398 పరుగుల ఆధిక్యం లభించింది. ఓపెనర్ రోరీ బర్న్స్ (90), కెప్టెన్ రూట్ (68 నాటౌట్), సిబ్లే (56) అర్ధసెంచరీలు సాధించారు. ఇక విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది.
బ్రాడ్ హవా...: 137/6 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన విండీ్‌సను పేసర్ బ్రాడ్ మరింత హడలెత్తించాడు. మిగిలిన నాలుగు వికెట్లనూ తనే చకచకా పడగొట్టడంతో కరీబియన్లు కనీసం 200 పరుగులు కూడా సాధించలేకపోయారు. ఆరంభంలో హోల్డర్ (46) ఆటతీరు చూస్తే విండీస్ గాడిలో పడినట్టే కనిపించింది. ఇంగ్లిష్ బౌలర్ల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో నిలిచాడు. బ్రాడ్ ఓవర్లో వరుస ఫోర్లతో చెలరేగాడు. డౌరిచ్ కూడా అతనికి సహకరించాడు. వీరిద్దరూ జట్టుకు ఫాలోఆన్ బెడదను తప్పించారు. కానీ అర్ధసెంచరీకి సమీపంలో ఉన్న హోల్డర్‌ను బ్రాడ్ ఎల్బీగా వెనక్కి పంపడంతో పతనం ఆరంభమైంది. ఏడో వికెట్‌కు వీరి మధ్య 68 పరుగులు నమోదయ్యాయి. కాసేపటికే బ్రాడ్ తన వరుస రెండు ఓవర్లలో మిగిన మూడు వికెట్లను కూడా తీసి విండీస్‌కు చెక్ పెట్టాడు. ఆ వెంటనే ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించి 10/0తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
ఓపెనర్ల సెంచరీ భాగస్వామ్యం: రెండో సెషన్లో ఓపెనర్లు బర్న్స్, సిబ్లే సమన్వయంతో బ్యాటింగ్ కొనసాగించారు. ఎక్కువగా సింగిల్స్‌పై దృష్టి సారించినా అడపాదడపా బౌండరీలు బాదేస్తూ ఆధిక్యాన్ని పెంచారు. బౌలర్లను మార్చినా ఈ జోడీని విడదీయలేకపోయారు. ప్రత్యర్థి సహనాన్ని పరీక్షిస్తూ ఈ సెషన్లో ఆధిక్యం ప్రదర్శించారు. టీ విరామానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 86 పరుగులతో ఉంది. అప్పటికి జట్టు ఆధిక్యం 258. ఇక చివరి సెషన్లో బర్న్స్, సిబ్లే ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. 2016 తర్వాత ఇంగ్లండ్ ఓపెనర్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఈ ఫీట్ సాధించడం ఇదే తొలిసారి. 37వ ఓవర్లో బర్న్స్ ఫోర్‌తో జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. అయితే విండీస్ బౌలర్లను విసిగిస్తున్న ఈ జంటను 41వ ఓవర్లో హోల్డర్ విడదీశాడు. సిబ్లేను ఎల్బీ చేయడంతో తొలి వికెట్‌కు 114 పరుగుల భాగస్వామ్యం ముగిసింది.
చివరి గంటలో వేగంగా..: సిబ్లే వికెట్ కోల్పోయాక ఇంగ్లండ్ ఆటలో వేగం పెరిగింది. బర్న్స్, రూట్ కలిసి ఎదురుదాడికి దిగారు. రూట్ తన సహజశైలికి భిన్నంగా వేగంగా పరుగులు సాధించడంతో ఆధిక్యం 350 దాటేసింది. కార్న్‌వాల్ ఓవర్లో సిక్సర్ బాదిన అతను 57వ ఓవర్లో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టాడు. అలాగే 49 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. అటు బర్న్స్ సెంచరీ ఖాయమే అనిపించినా వేగంగా ఆడే క్రమంలో 90 పరుగుల వద్ద అవుట్ కావడంతో వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశారు.
2000 పరుగులు, వంద వికెట్లు..
వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ ఈ మ్యాచ్ ద్వారా పలు రికార్డులను నమోదు చేశాడు. బ్యాటింగ్‌లో 2000 పరుగులు.. బౌలింగ్‌లో 100+ వికెట్లు తీసిన మూడో విండీస్ క్రికెటర్‌గా హోల్డర్ నిలిచాడు. గతంలో గ్యారీ సోబర్స్, కార్ల్ హూపర్ ఈ ఘనత సాధించారు. అలాగే టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో విండీస్ కెప్టెన్ అయ్యాడు. సోబర్స్ (117) ముందున్నాడు. మరోవైపు టెస్టులు, వన్డేల్లోనూ 100+ వికెట్లు తీసిన నాలుగో కెప్టెన్‌గా హోల్డర్ నిలిచాడు. అతడికంటే ముందు ఇమ్రాన్, వసీం అక్రమ్, పొలాక్ ఉన్నారు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 369; విండీస్ తొలి ఇన్నింగ్స్: 197 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్ప్ (సి సబ్) జోషువా డి సిల్వ (బి) చేజ్ 90; సిబ్లే (ఎల్బీ) హోల్డర్ 56; రూట్ (నాటౌట్) 68; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 58 ఓవర్లలో 226/2 డిక్లేర్డ్; వికెట్ల పతనం: 1-114; బౌలింగ్: రోచ్ 11-4-34-0; గాబ్రియెల్ 5-0-19-0; హోల్డర్ 9-2-24-1; చేజ్ 14-2-61-1, కార్న్‌వాల్ 19-2-79-0.
విండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (బ్యాటింగ్) 2; క్యాంప్‌బెల్ (సి) రూట్ (బి) బ్రాడ్ 0; రోచ్ (సి) బట్లర్ (బి) బ్రాడ్ 4; హోప్ (బ్యాటింగ్) 4; మొత్తం: 6 ఓవర్లలో 10/2; వికెట్ల పతనం: 1-0, 2-6; బౌలింగ్: అండర్సన్ 3-2-2-0; బ్రాడ్ 3-1-8-2.