భారత్‌ పర్యటనకు ఇంగ్లండ్.. డే/నైట్ టెస్టుకు ‘మొతేరా’ ఆతిథ్యం

ABN , First Publish Date - 2020-12-10T22:53:33+05:30 IST

భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన ఖరారైంది. ఈ పూర్తిస్థాయి పర్యటనకు సంబంధించి బీసీసీఐ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లు

భారత్‌ పర్యటనకు ఇంగ్లండ్.. డే/నైట్ టెస్టుకు ‘మొతేరా’ ఆతిథ్యం

న్యూఢిల్లీ: భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన ఖరారైంది. ఈ పూర్తిస్థాయి పర్యటనకు సంబంధించి బీసీసీఐ, ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)లు నేడు అధికారికంగా ప్రకటించాయి. ఇందులో భాగంగా డే/నైట్ టెస్టు సహా నాలుగు టెస్టు మ్యాచ్‌లు, ఐదు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జరగనుంది. తొలి రెండు టెస్టులకు చెన్నై ఆతిథ్యం ఇవ్వనుండగా, అహ్మదాబాద్‌లో పునర్నిర్మించిన మొతేరా స్టేడియం మూడోదైన డే/నైట్ టెస్టు, చివరి టెస్టుతోపాటు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వేదిక కానుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ పూణెలో జరగనుంది.  


భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరు మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా కారణంగా క్రికెట్‌కు బ్రేక్ పడిన నేపథ్యంలో ఇంగ్లండ్ టూర్ భారత్‌లో తొలి పూర్తిస్థాయి అంతర్జాతీయ పర్యటన కానుంది.


ఇంగ్లండ్ పర్యటన ఇలా.. 

ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు చెన్నైలో తొలి టెస్టు జరగనుండగా, 13 నుంచి 17 మధ్య అక్కడే రెండో టెస్టు జరగనుంది. ఆ తర్వాత ఇరు జట్లు అహ్మదాబాద్‌కు పయనమవుతాయి. అక్కడి మొతేరా స్టేడియంలో 24 నుంచి 28 వరకు మూడోదైన డే/నైట్ టెస్టు జరగనుండగా, అదే స్టేడియంలో మార్చి 4 నుంచి 8 వరకు చివరిదైన నాలుగో టెస్టు మ్యాచ్ జరగుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా అదే స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 12,14,16, 18, 20 తేదీలలో ఐదు టీ20లు జరగనున్నాయి. పర్యటన చివరిలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ పూణెలో జరగనుంది. మార్చి 23, 26, 28 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. 

Updated Date - 2020-12-10T22:53:33+05:30 IST