‘ఉమ్మి’రూల్ బ్రేక్ చేసిన తొలి క్రికెటర్ ఎవరంటే..
ABN , First Publish Date - 2020-07-20T01:46:35+05:30 IST
కరోనా నేపథ్యంలో ప్రపంచ క్రికెట్‌లో అనేక కొత్త నిబంధనలను ఐసీసీ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా బంతిని ఉమ్మితో...

లండన్: కరోనా నేపథ్యంలో ప్రపంచ క్రికెట్‌లో అనేక కొత్త నిబంధనలను ఐసీసీ ప్రవేశపెట్టింది. ముఖ్యంగా బంతిని ఉమ్మితో శుభ్రం చేయడాన్ని నిషేధించింది. అయితే ఈ నిబంధనలను తొలిసారిగా ఇంగ్లాండ్ ఆటగాడు డామ్ సిబ్లీ అతిక్రమించాడు. ఇంగ్లాండ్-విండీస్‌ల మధ్య జరుగుతున్న 2వ టెస్ట్ 4వ రోజు ఆటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనాను కూడా పక్కన పెట్టి ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్లు టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో సిబ్లీ ఈ చర్యకు పాల్పడ్డాడు. నాలుగో రోజు లంచ్‌కు ముందు క్రిస్ ఓక్స్ ఓవర్ పూర్తవగానే బంతి సిబ్లీ చేతికొచ్చింది. బంతిని అందుకున్న సిబ్లీ అనుకోకుండా ఉమ్మితో శుభ్రం చేశాడు. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు విషయాన్ని అంపైర్లకు తెలియజేశారు. వెంటనే అంపైర్లు బంతిని తీసుకుని శానిటైజర్ టవల్‌తో శుభ్రం చేశారు.
ఇదిలా ఉంటే ఉమ్మి నిబంధనకు ఆటగాళ్లు ఇంకా అలవాటు పడలేదన్న విషయం ఈ ఘటనతో రుజువైంది. అయితే మిగతా దేశాల్లో కూడా క్రికెట్ ప్రారంభమైతే ఇంకెంతమంది ఆటగాళ్లు ఇలా చేస్తారోనని క్రికెట్ విశ్లేషకులు ఆలోచనలో పడ్డారు.