ఐపీఎల్-2020ని డ్రీమ్11 ఎలా సొంతం చేసుకుందో తెలుసా!
ABN , First Publish Date - 2020-08-18T21:59:28+05:30 IST
ఐపీఎల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ ఎన్నో రోజులుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనీస్ మొబైల్ కంపెనీ వివోను..
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాన్సర్షిప్ కోసం బీసీసీఐ ఎన్నో రోజులుగా వెతుకుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనీస్ మొబైల్ కంపెనీ వివోను బాయ్‌కాట్ చైనా క్యాంపెయిన్ నేపథ్యంలో బీసీసీఐ తొలగించింది. దీంతో ఐపీఎల్-2020 కొత్త స్పాన్సర్ కోసం బిడ్డింగ్‌ను నిర్వహించింది. అందులో అనేక సంస్థలు పాల్గొన్నాయి. దీనిలో ముఖ్యంగా మూడు సంస్థలు అత్యధిక బిడ్లను దాఖలు చేశాయి. ఆన్లైన్ ఫ్యాంటసీ లీగ్ సంస్థ డ్రీమ్11 రూ.222 కోట్లకు, ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ రూ.201 కోట్లకు, మరో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అన్అకాడమీ రూ.171 కోట్లకు బిడ్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో అత్యధిక బిడ్ దాఖలు చేసిన డ్రీమ్11 ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ చేజిక్కించుకుంది. అయితే వివోతో పోలిస్తే డ్రీమ్11 సగం ధరకే స్పాన్సర్షిప్ సొంతం చేసుకుంది.
దీనిపై ఐపీఎల్ చైర్మన్ బ్రిజీష్ పాటిల్ స్పందించారు. ‘ఈ స్పాన్సర్షిప్ కేవలం నాలుగు నెలలకు మాత్రమే. ఐపీఎల్-2020కి మాత్రమే డ్రీమ్11 స్పాన్సర్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే డ్రీమ్11కు స్పాన్సర్షిప్ ఇచ్చాం. వచ్చే ఏడాది మరో స్పాన్సర్ కోసం బిడ్డింగ్ నిర్వహిస్తామ’ని బ్రిజేష్ పాటిల్ పేర్కొన్నారు.