ఆ ఇద్దర్నీ నేనే గుర్తించా!
ABN , First Publish Date - 2020-04-08T09:10:44+05:30 IST
బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏజ్ గ్రూప్ క్రికెట్లోనే కోహ్లీ అద్భుత ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించాడు. టాలెంట్ హంట్‌లో తనదైన ముద్రవేశాడు. 2006-08 వరకు చీఫ్

- ధోనీ, కోహ్లీని వెలికితీసింది అతడే
న్యూఢిల్లీ: బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా దిలీప్ వెంగ్‌సర్కార్‌కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏజ్ గ్రూప్ క్రికెట్లోనే కోహ్లీ అద్భుత ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించాడు. టాలెంట్ హంట్‌లో తనదైన ముద్రవేశాడు. 2006-08 వరకు చీఫ్ సెలెక్టర్‌గా పని చేసిన వెంగ్‌సర్కార్.. సెలెక్షన్ కమిటీకి సరికొత్త ప్రమాణాలు నెలకొల్పాడు. తన తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించే వారికి మార్గదర్శిగా నిలిచాడు. సహజ ప్రతిభ ఉన్న కోహ్లీ లాంటి వారికి అండగా నిలిచినా..ధోనీకి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలన్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నా అతడికే చెల్లింది. ప్రస్తుతం మనుగడలో లేని బీసీసీఐ టాలెంట్ రీసెర్చ్ డెవల్‌పమెంట్ వింగ్ (టీఆర్డీడబ్ల్యూ) హెడ్‌గా విధులు నిర్వర్తించిన తాను.. సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి తగిన న్యాయం చేయగలనని విశ్వసించానని చెప్పాడు. విరాట్ గురించి మాట్లాడుతున్నప్పుడు.. అతడి మాటల్లో ఏదో సాధించానన్న భావం తొణికిసలాడింది. ఆస్ట్రేలియా టూర్‌కు ఏమాత్రం అనుభవం లేని కోహ్లీని వెంగీ ఎంపిక చేసి అందరినీ ఆశ్చర్యానికిగురి చేశాడు. ‘అండర్-16, అండర్-19 టోర్నీలో కోహ్లీ ఆటను నిశితంగా గమనించా. సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన తర్వాత విరాట్‌కు టీమ్‌లో అవకాశం కల్పించా. భవిష్యత్‌లో అతడు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకం నాలో కలిగింద’ని గుర్తుచేసుకున్నాడు.
మహీ వయసు ఎక్కువైనా..
టీఆర్డీడబ్లూ స్కీమ్ కింద అండర్-19 క్రికెటర్లను మాత్రమే గుర్తించాలని ఉంది. కానీ, ధోనీ వయసు ఎక్కువైనా.. ప్రతిభకు ఏదీ అడ్డుకారాదనే ఉద్దేశంతోనే ఆ సమయంలో ధోనీకి అవకాశం కల్పించినట్టు వెంగ్‌సర్కార్ తెలిపాడు. ‘అండర్-19 మ్యాచ్ టాలెంట్ హంట్ జరుగుతున్న సమయంలో పక్కన బిహార్ జట్టు రంజీ ఆడుతోంది. కొన్ని బంతులు స్టేడియం బయటకు రావడంతో ఎవరా? అని ఆరా తీశా. అప్పటికి ధోనీ వయసు 21 ఏళ్లు. కానీ, ప్రతిభ ఉన్న వాళ్లకు అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతోనే మహీకి ఆ స్కీమ్‌లో చాన్స్ ఇచ్చాన’ని దిలీప్ చెప్పాడు. కాగా, ఒకప్పుడు ఎంతో మంది ప్రతిభావంతులను తయారు చేసిన జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) ఇప్పుడు పునరావాస కేంద్రంగా మారడంపై కల్నల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడాలని సూచించాడు.