శ్రీకాంత్‌కు భలే చాన్స్‌

ABN , First Publish Date - 2020-10-13T09:42:49+05:30 IST

కొవిడ్‌ కారణంగా దాదాపు ఏడు నెలలు బ్యాడ్మింటన్‌ టోర్నీలకు దూరమైన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ ...

శ్రీకాంత్‌కు భలే చాన్స్‌

నేటి నుంచే డెన్మార్క్‌ ఓపెన్‌ 

 ఒడెన్స్‌ (డెన్మార్క్‌): కొవిడ్‌ కారణంగా దాదాపు ఏడు నెలలు బ్యాడ్మింటన్‌ టోర్నీలకు దూరమైన తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్‌ తిరిగి అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం ప్రారంభమయ్యే డెన్మార్క్‌ ఓపెన్‌లో భారత్‌ నుంచి శ్రీకాంత్‌ హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. మూడేళ్ల కిందట శ్రీకాంత్‌ డెన్మార్క్‌  టైటిల్‌ను నెగ్గాడు. ఈసారి వరల్డ్‌ చాంపియన్‌ కెంటో మొమోటోతో పాటు పలువురు టాప్‌ ఆటగాళ్లు టోర్నీ నుంచి వైదొలగడంతో శ్రీకాంత్‌పై అంచనాలు పెరిగాయి. మాజీ వరల్డ్‌ నెంబర్‌ వన్‌ శ్రీకాంత్‌.. సింగిల్స్‌ తొలి రౌండ్లో 52వ ర్యాంకర్‌ టొబీ పింటీ (ఇంగ్లండ్‌)తో తలపడనున్నాడు. ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న శ్రీకాంత్‌కు క్యార్టర్స్‌ దాకా పెద్దగా పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదు. క్వార్టర్స్‌లో రెండో సీడ్‌ చౌ టైన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)తో శ్రీకాంత్‌కు సవాల్‌ ఎదురు కానుంది. ఈ పోరులో చెన్‌పై అతడు పైచేయి సాధిస్తే టైటిల్‌కు దాదాపు చేరువైనట్టే. ఇక, శ్రీకాంత్‌తో పాటు భారత్‌ నుంచి లక్ష్యసేన్‌, శుభాంకర్‌ డే, అజయ్‌ జయరామ్‌ ఆడుతున్నారు. కాగా, మహిళల స్టార్లు పీవీ సింధు, సైనా టోర్నీలో ఆడడం లేదు.

Updated Date - 2020-10-13T09:42:49+05:30 IST