ఢిల్లీ ఎదుట భారీ విజయ లక్ష్యం.. ఛేదించేనా?

ABN , First Publish Date - 2020-10-28T02:57:51+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నామమాత్రమైన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్ చెలరేగిపోయారు. పోటీపోటీగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు

ఢిల్లీ ఎదుట భారీ విజయ లక్ష్యం.. ఛేదించేనా?

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నామమాత్రమైన మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్  చెలరేగిపోయారు. పోటీపోటీగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. హైదరాబాద్ బ్యాటింగ్ చూసి బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నానా? అని ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధపడి ఉండొచ్చు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టారు. వారి దెబ్బకు స్కోరు బోర్డు జెట్ స్పీడ్‌తో పరుగులు తీసింది. ఎంతలా అంటే 5 ఓవర్లకు 55/0, 9 ఓవర్లకు 100 పరుగులు దాటేసింది. 


ఆరో ఓవర్‌లోనే 25 బంతుల్లోనే డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడంటే అతడి వేగం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో 34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 66 పరుగులు చేసి అశ్విన్ బౌలింగులో అక్సర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 107 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే జతగా సాహా చిచ్చరపిడుగల్లే చెలరేగిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఫీల్డర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు. మరోవైపు, మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝళిపించడంతో 14 ఓవర్లకే స్కోరు 160 పరుగులు దాటింది. ఈ క్రమంలో 45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసిన సాహా మరో భారీ షాట్‌కు యత్నంచి నోర్జే బౌలింగులో శ్రేయాస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 


నిజానికి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఊపు చూస్తే 230కి పైగా స్కోరు ఖాయమని భావించారు. అయితే, చివరి మూడు ఓవర్లలో ఢిల్లీ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 219 పరుగులు చేసి ప్రత్యర్థికి సవాలు విసిరింది. 


మనీశ్ పాండే 31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 44పరుగులు చేయగా, విలియమ్సన్ 11 పరుగులు చేశాడు. దుబాయ్ స్టేడియంలో ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఇదే మైదానంలో బెంగళూరుపై పంజాబ్ 206/3 స్కోరు నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా, ఇప్పుడు దానిని హైదరాబాద్ అధిగమించింది.

Updated Date - 2020-10-28T02:57:51+05:30 IST