రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ‘సూపర్’ విజయం
ABN , First Publish Date - 2020-09-21T05:24:00+05:30 IST
ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా యూఏఈలో జరిగిన రెండో మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ చెత్త బ్యాటింగ్తోటి రెండు పరుగులకే కేఎల్ రాహుల్, పూరన్‌ల వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ ఢిల్లీకి పూర్తి అనుకూలంగా మారింది. తరువాత బ్యాటింగ్‌కు దిగిన శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్‌లు ఆ రెండు పరుగులు చేసి లాంఛనం పూర్తి చేశారు. దీంతో ఢిల్లీ రెండో మ్యాచ్‌లో విజేతగా నిలిచింది.
మ్యాచ్ సాగిందిలా..
పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే స్కోరుబోర్డు చాలా నెమ్మదిగా సాగుతుండటంతో 130 కంటే ఎక్కువ స్కోరు కొట్టలేదు అని అందరూ అనుకున్నారు. కానీ.. మార్కస్ స్టొయినిస్ చివర్లో పరుగుల వరద పారించాడు. ఆఖరులో చెలరేగి ఆడి 21 బంతుల్లో 53 పరుగులు చేయడంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఇక చేజింగ్‌కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 55 పరుగులకే ఐదు వికెట్లు పడిపోవడంతో ఓడిపోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.
అయితే మయాంక్ అగర్వాల్ స్కోరును పరుగులు పెట్టించాడు.60 బంతుల్లో 89 పరుగులు తీసి జట్టును విజయానికి చేరువ చేశాడు. అయితే చివరి రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సి ఉండగా.. హెట్మెయిర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఇక చివరి బంతికి ఆ ఒక్క పరుగు చేయలేక మరో వికెట్‌ను కూడా పంజాబ్ కోల్పోవడంతో మ్యాచ్ టై అయింది. ఇక సూపర్ ఓవర్లో విజయం ఢిల్లీ సొంతమైంది.