సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వార్నర్

ABN , First Publish Date - 2020-11-15T16:49:58+05:30 IST

బీసీసీఐ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో తొమ్మిదో జట్టుకు చోటు కల్పించాలని భావిస్తోందని, ఇతర జట్ల ఫ్రాంచైజీల్లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న...

సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన వార్నర్

కేన్ విలియమ్‌సన్‌ను వదులుకోం: డేవిడ్ వార్నర్

సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలకంగా ఉన్న కివీస్ క్రికెటర్ కేన్ విలియమ్సన్‌ను వచ్చే ఐపీఎల్‌ వేలంలో వదులుకోబోమని, వచ్చే సీజన్‌లో కూడా కేన్ ఎస్‌ఆర్‌హెచ్ తరపునే ఆడతాడని సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులకు ఊరట లభించినట్టయింది. ఓ అభిమాని ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నకు వార్నర్ ఈ సమాధానమిచ్చాడు. వచ్చే సీజన్‌లో విలియమ్సన్ సన్‌రైజర్స్ తరపున ఆడకపోవచ్చనే ఊహాగానాలు వినిపించాయి. బీసీసీఐ వచ్చే ఐపీఎల్‌ సీజన్‌లో తొమ్మిదో జట్టుకు చోటు కల్పించాలని భావిస్తోందని, ఇతర జట్ల ఫ్రాంచైజీల్లో కూడా కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఫామ్‌లో ఉన్న విలియమ్సన్‌ను వేలంలో దక్కించుకునేందుకు ఇతర జట్ల ఫ్రాంచైజీలు ఆసక్తి చూపే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగింది.


ఈ కివీస్ క్రికెటర్ ఈ సీజన్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ దాదాపుగా రాణించాడు. కొన్ని మ్యాచ్‌ల్లో విలియమ్స‌న్ చేసిన స్కోర్ ఎస్‌ఆర్‌హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి విలియమ్సన్ ఎస్‌ఆర్‌హెచ్‌లో లేకపోతే ఆ లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. అయితే.. వార్నర్ రిప్లై‌తో ఈ ఊహాగానాలకు తెరపడింది. ఫ్యాన్స్‌ ఊరట చెందారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో విలియమ్సన్ మొత్తం 317 పరుగులు చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు.

Updated Date - 2020-11-15T16:49:58+05:30 IST