ధోనీ వర్సెస్ కార్తీక్.. గెలుపుపై కసితో కెప్టెన్లు!
ABN , First Publish Date - 2020-10-07T23:42:37+05:30 IST
ఐపీఎల్‌లో నేడు మరో కీలకమైన జరగబోతోంది. ఓటములతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఇరు జట్లుకు నేటి మ్యాచ్ ఎంతో

అబుదాబి: ఐపీఎల్‌లో నేడు మరో కీలక మ్యాచ్ జరగబోతోంది. ఓటములతో ఇంటాబయటా విమర్శలు ఎదుర్కొంటున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లుకు నేటి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. గెలుపు కోసం ధోనీ, దినేశ్ కార్తీక్‌లు ఇద్దరూ కసితో రగిలిపోతున్న వేళ ఐపీఎల్‌లో నేటి పోరు అభిమానులకు మరో పసందైన విందు కానుందడనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
ముంబైతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో విజయం సాధించిన చెన్నై ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో కుంగిపోయింది. దీంతో ధోనీ కెప్టెన్సీ, ఆటతీరుపై మరోమారు విమర్శలు వెల్లువెత్తాయి. ధోనీ వయసు చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించి విమర్శలకు చెక్ పెట్టినా, ఆ ఫామ్‌ను నేడు కూడా కొనసాగించాల్సి ఉంటుంది. లేకుంటే నాలుగో స్థానం ఆశలు దాదాపు వదులుకోవాల్సిందే.
రాయుడు, బ్రావోలు జట్టులోకి రావడం ధోనీ సేనకు కొండంత బలమనే చెప్పుకోవాలి. జట్టులో వీరిద్దరి చేరికతో సమతూకంగా ఉంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 179 పరుగుల విజయ లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించడంతో ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగింది. మరోవైపు, షేన్ వాట్సన్, డుప్లెసిస్‌లు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయడం విశేషం.
ఇక, కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. పేలవ ఫామ్ కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ ప్రదర్శన మాత్రం చెత్తగా ఉండడం ఆ జట్టును వేధిస్తోంది. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో మాత్రమే గెలిచిన దినేశ్ కార్తీక్ సేన చెన్నై కంటే పైనుంది. అయితే జట్టు కూర్పుపై విమర్శలు వినిపిస్తున్నాయి.
కార్తీక్ ఆటతీరు కూడా ఏమంత బాగోలేదు. దీంతో అతడి స్థానాన్ని ఇయాన్ మోర్గాన్‌తో భర్తీ చేయాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు ఫైరవుతున్నారు. సునీల్ నరైన్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ఇబ్బంది పడుతుండడం, దినేశ్ కార్తీక్ పేలవ ఫామ్ జట్టుకు కష్టాలు తెచ్చిపెడుతోంది.
బ్యాటింగులో ఎక్కువగా శుభ్‌మన్ గిల్, ఇయాన్ మోర్గాన్‌పైనే జట్టు ఆధారపడుతోంది. ఇక, విండీస్ ఆటగాళ్లు సునీల్ నరైన్, రస్సెల్‌లు ఇప్పటికైనా బ్యాట్ ఝళిపించకుంటే జట్టు గట్టెక్కడం అనుమానమే. కాగా, చెన్నై-కోల్‌కతాలు ఇప్పటి వరకు 20 మ్యాచుల్లో తలపడగా 13 సార్లు చెన్నై విజయం సాధించింది.