టీమిండియా ఒకటి కాదు రెండు..

ABN , First Publish Date - 2020-05-17T17:51:28+05:30 IST

ఒక దేశం.. ఒకటే క్రికెట్‌ జట్టు. ఇన్నాళ్లు చూశాం. ఇక, రెండు జట్లు చూడబోతున్నాం. అందుకోసం భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే జరిగితే..

టీమిండియా ఒకటి కాదు రెండు..

ఒక దేశం.. ఒకటే క్రికెట్‌ జట్టు. ఇన్నాళ్లు చూశాం. ఇక, రెండు జట్లు చూడబోతున్నాం. అందుకోసం భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇదే జరిగితే.. టీమ్‌ఇండియా టీములు రెండు అవుతాయి.. ఎందుకో తెలుసా? అంతా.. కరోనా మహిమ.. 


భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌... అదే రోజు సాయంత్రం మన జట్టుకు ఆస్ట్రేలియాకు మధ్య‘టి 20’ మ్యాచ్‌. ఒకేరోజు... ఒకే దేశం... రెండు భిన్న ఫార్మాట్‌లలో... వేర్వేరు దేశాలతో... వేర్వేరు వేదికలపై పోటీ... ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? బీసీసీఐ (భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు) ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే ఇలాంటి రెండు జట్ల మ్యాచ్‌లు చూసే భాగ్యం కలగనుంది. ఒకే సమయంలో విభిన్న జట్లతో భారత్‌  రెండు ఫార్మాట్‌లలోనూ ఆడొచ్చు. ఫార్మాట్‌కు తగిన జట్టును తయారు చేయాలని చాన్నాళ్ల నుంచి బోర్డు ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టు కొందరు ఆటగాళ్లను తమ శైలికి తగిన ఫార్మాట్‌కే ఎంపిక చేస్తోంది. అయితే పూర్తిగా భిన్నమైన జట్లు... అది కూడా ఒకే సమయంలో వేర్వేరు మ్యాచ్‌ల నిర్వహణ మాత్రం మన బోర్డుకి కొత్తే. మూడేళ్ల కిందట ఆస్ట్రేలియా రెండు జట్ల ప్రయోగం చేసింది. తొలుత శ్రీలంకతో అడిలైడ్‌లో టి 20 ఆడిన ఆసీస్‌.. తర్వాతి రోజే వేరే జట్టుతో పుణెలో భారత్‌తో టెస్టు పోరుకు తలపడింది. తర్వాత మరే దేశమూ ఈ ఆలోచన జోలికి వెళ్లలేదు. మరి హఠాత్తుగా బీసీసీఐకి ఇదెందుకు గుర్తొచ్చింది... అంటే సమాధానం సింఫుల్‌... కరోనా.


కాసులు కావొద్దూ..

ఈ మహమ్మారి వల్ల తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో క్రీడారంగం ఒకటి. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌ కరోనా దెబ్బతో వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహణ ఈ ఏడాది కష్టమే. దీంతో భారత క్రికెట్‌పై పెను ప్రభావం చూపింది. తద్వారా ప్రపంచ క్రికెట్టూ నష్టపోతోంది. ఐపీఎల్‌తో అన్ని దేశాల క్రికెటర్లకే కాదు... వారి బోర్డులకూ మంచి ఆదాయమే సమకూరుతోంది. ప్రతి ఆటగాడు తనకు లభించే ఫీజులో 20 శాతం తమ బోర్డుకు చెల్లించాలి. రెండు దేశాల మధ్య జరిగే కొన్ని ద్వైపాక్షిక సిరీస్‌లు రద్దవడంతో భారత్‌ నష్టనివారణ చర్యలపై దృష్టి పెట్టింది. వీలైనంత వేగంగా ఆదాయం రావాలంటే వేర్వేరు జట్లతో బరిలోకి దిగాలని యోచిస్తోంది.


గ్రీన్‌ సిగ్నల్‌ లభిస్తే..

తాజా ప్రతిపాదనలను బీసీసీఐ ఆమోదిస్తే ఏం జరుగుతుంది? విరాట్‌ లాంటి బ్యాట్స్‌మన్‌కు ఫార్మాట్‌ ఎంపికలో సందిగ్ధం ఏర్పడవచ్చు. ఎవరు టెస్టుల్లో ఆడాలి? ఎవరు టి 20లో ఆడాలి? బ్యాట్స్‌మన్‌లు, బౌలర్లను, మంచి ఫీల్డర్లను.. రెండు జట్లుగా విడగొట్టడం అంత సులభం కాదు. అందులోనూ క్రికెటర్ల వయసునూ లెక్కలోకి తీసుకోవాలి. ప్రతిభను సమంగా పంచాలి. ఇలా కొన్ని చిక్కులైతే ఉన్నాయి. అయితే జట్టు ఎంపిక బాధ్యత సెలక్షన్‌ కమిటీదే కాబట్టి.. ఆటగాళ్లపై ఒత్తిడి కొంతమేరకే ఉండొచ్చు. 


రెండు జట్లకు ఇద్దరు కెప్టెన్లు ఉన్నట్లే.. ఇద్దరేసి కోచ్‌లూ ఉండితీరాల్సిందే. టూర్లు వెళ్లేప్పుడు ఆటగాళ్లకు ప్రయాణ, వసతి సౌకర్యాలు చూసే మేనేజర్లూ కావాలి. గందరగోళం లేని షెడ్యూల్‌నూ రూపొందించాలి. ఒకరకంగా చెప్పాలంటే- ఏక కాలంలో రెండు సినిమాలు చేసే  హీరోకు కాల్‌షీట్లను సర్దడం ఎంత కష్టమో.. క్రికెటర్ల షెడ్యూల్‌ను ఫిక్స్‌ చేయడం అంత కష్టం.


టెస్టుమ్యాచ్‌లకు దెబ్బ..

క్రికెట్‌లో ఇప్పుడంతా మూడు గంటల్లో ముగిసే టి20లదే హవా. టెస్టా... టి20నా అంటే పొట్టి ఫార్మాట్‌కే మొగ్గు చూపు తున్నారు క్రీడాభిమానులు. అలాంటిది ఒకేసారి కొత్త ఫార్మాట్లలో టీమిండియాను బరిలోకి దింపితే టెస్టులు మరింత నిరాదరణకు గురయ్యే ప్రమాదం ఉంది. స్పాన్సర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ‘అంతర్జాతీయ క్రికెట్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. ఆటగాళ్లు... అధికారులు... ప్రసార హక్కుదారులు ఇలా ఎంతోమంది క్రికెట్‌పై ఆధారపడి ఉన్నారు. వేల కోట్ల పెట్టుబడులూ ముడిపడి ఉన్నాయి. ఈ నష్టాలు భర్తీ కావాలంటే వినూత్న ఆలోచనలు చేయాలి. అందులో భాగమే భిన్న జట్లతో టోర్నీల ప్రతిపాదన’ అంటూ ఇటీవలే  బీసీసీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నాడు.  


- మట్టపల్లి రమేష్‌Updated Date - 2020-05-17T17:51:28+05:30 IST