క్రాలే భారీ శతకం
ABN , First Publish Date - 2020-08-22T07:40:06+05:30 IST
ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రాలే (171 బ్యాటింగ్), జోస్ బట్లర్ (87 బ్యాటింగ్) అజేయ ఆటతీరుతో అదరగొట్టారు. దీంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య జట్టు భారీ స్కోరు
సౌతాంప్టన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జాక్ క్రాలే (171 బ్యాటింగ్), జోస్ బట్లర్ (87 బ్యాటింగ్) అజేయ ఆటతీరుతో అదరగొట్టారు. దీంతో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 90 ఓవర్లలో 4 వికెట్లకు 332 పరుగులు చేసింది. క్రాలే టెస్టు కెరీర్‌లో ఇదే తొలి శతకం. ఓ దశలో 127/4 స్కోరుతో ఇబ్బందుల్లో పడిన జట్టును క్రాలే, బట్లర్ నిలకడైన ఆటతో ఐదో వికెట్‌కు అజేయంగా 205 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రూట్ సేన ఐదో ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో సిబ్లే (22)తో కలిసి క్రాలే రెండో వికెట్‌కు.. మూడో వికెట్‌కు రూట్ (29)తో కలిసి 41 పరుగులు జత చేశాడు. పోప్ (3) నిరాశపరిచినా క్రీజులోకి వచ్చిన బట్లర్.. క్రాలేకు అండగా నిలవడంతో పాక్ బౌలర్లకు కష్టాలు ప్రారంభమయ్యాయి. చివరి సెషన్ పూర్తిగా ఈ జోడీ ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి.