కోచ్‌లపై సర్కార్‌ చిన్నచూపు..

ABN , First Publish Date - 2020-09-17T08:47:32+05:30 IST

క్రీడాకారులను తయారు చేయాలన్న పట్టుదలతో కోచింగ్‌ వృత్తిలోకి ప్రవేశించిన శిక్షకులు సరైన గుర్తింపు లేక

కోచ్‌లపై సర్కార్‌ చిన్నచూపు..

దశాబ్దాలుగా సేవలందిస్తున్నా దక్కని గౌరవం


‘నాకు 2015లో అర్జున అవార్డు లభించింది. దేశం గర్వించే క్రీడాకారులను తయారు చేయాలని శాట్స్‌తో కలిసి పనిచేసేందుకు నా ఆసక్తి తెలియజేశా. పక్క రాష్ట్రాల్లో నాలాంటి క్రీడాకారులకు గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగాలిస్తుంటే నన్ను ఔట్‌ సోర్సింగ్‌ కోచ్‌గా నియమించారు. ఇందుకు నేను బాధపడడం లేదు. కానీ, మాలాంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది’ 


  అనూప్‌ కుమార్‌ యమా అర్జున అవార్డు గ్రహీత, రోలర్‌ స్కేటింగ్‌ క్రీడాకారుడు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి)/వైఎంసీఏ: మేటి క్రీడాకారులను తయారు చేయాలన్న పట్టుదలతో కోచింగ్‌ వృత్తిలోకి ప్రవేశించిన శిక్షకులు సరైన గుర్తింపు లేక అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణలో 1993, 1999 బ్యాచ్‌కు చెందిన 18 మంది ఒప్పంద కోచ్‌లు, ఆ తర్వాత పే అండ్‌ ప్లే విధానంలో దశలవారీగా  తీసుకున్న 80 మందికి పైగా ఉన్న అవుట్‌ సోర్సింగ్‌ కోచ్‌లు సరైన జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. కామన్వెల్త్‌ పతకాలు, అర్జున అవార్డు గెలిచిన వారికి పొరుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి గౌరవిస్తుంటే.. తెలంగాణలో కనీసం ప్రభుత్వ కోచ్‌గా కూడా కొలువు ఇవ్వలేకపోతున్నారని క్రీడా నిపుణులు వాపోతున్నారు. వర్థమాన క్రీడాకారులను తీర్చిదిద్దడానికి మేటి కోచ్‌లను ఉపయోగించుకోవాలనే చిత్తశుద్ధి ప్రస్తుత స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్స్‌) చైర్మన్‌, అధికార యంత్రాంగానికి లేదని క్రీడా సంఘాలు విమర్శిస్తున్నాయి.


ఒప్పంద కోచ్‌లకు రూ. 29 వేలు, ఔట్‌సోర్సింగ్‌ కోచ్‌లకు రూ. 21 వేలు మాత్రమే వేతనంగా ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్‌ఐఎస్‌ ఏడాది డిప్లమా కోర్సు ఉత్తీర్ణులై మూడేళ్లు కోచ్‌గా పనిచేసిన వారి సర్వీ్‌సను క్రమబద్ధీకరిస్తుంటే రాష్ట్ర క్రీడాశాఖ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్పోర్ట్స్‌ అథారిటీ పాలనాంశాలపై అవగాహన లేని వ్యక్తిని గత ఎండీ సలహాదారుడిగా నియమించుకున్నారన్న ఆరోపణలున్నాయి. ఆ ఎండీ పదవీ విరమణ తర్వాత వచ్చిన కొత్త అధికారులకు పాలనాంశాలపై ఇంకా పట్టు చిక్కకపోవడంతో సలహాదారుడిగా ఉన్న ఆ వ్యక్తి చెప్పిందే వేదంగా నడుస్తోందన్న విమర్శలున్నాయి. కోచ్‌లంటే గౌరవం లేని ఆ వ్యక్తే తమ క్రమబద్ధీకరణకు మోకాలడ్డుతున్నారని పలువురు కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-09-17T08:47:32+05:30 IST