రెండు రికార్డులపై కన్నేసిన యుజ్వేంద్ర చాహల్

ABN , First Publish Date - 2020-12-05T23:48:31+05:30 IST

ఆస్ట్రేలియాతో మొన్న జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహాల్.

రెండు రికార్డులపై కన్నేసిన యుజ్వేంద్ర చాహల్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో మొన్న జరిగిన తొలి టీ20లో మూడు వికెట్లు తీసి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన యుజ్వేంద్ర చాహాల్.. పేసర్ బుమ్రా రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రేపు (ఆదివారం) జరగనున్న రెండో టీ20లో చాహల్ కనుక మరో రెండు వికెట్లు పడగొడితే పేసర్ జస్ప్రిత్ బుమ్రా రికార్డును అధిగమిస్తాడు.


ఇప్పటి వరకు  43 అంతర్జాతీయ టీ20లు ఆడిన చాహల్ 58 వికెట్లు పడగొట్టాడు. 49 టీ20లు ఆడిన బుమ్రా 59 వికెట్లు తీసి చాహల్ కంటే ఒక్క వికెట్ ముందున్నాడు. రేపటి మ్యాచ్‌లో చాహల్ కనుక రెండు వికెట్లు పడగొడితే బుమ్రా రికార్డును అధిగమిస్తాడు. ఒక్క వికెట్ తీస్తే అతడి రికార్డు సమం అవుతుంది. అంతేకాదు, రెండు వికెట్లు కనుక తీస్తే పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కుతాడు. 


ప్రస్తుతం బుమ్రా విశ్రాంతి తీసుకుంటున్నాడు. దీంతో తొలి టీ20లో ఆడలేదు. అయితే, రేపటి మ్యాచ్‌లో దిగేది, లేనిది తెలియరాలేదు. నిజానికి తొలి టీ20 ఆడే భారత జట్టులో తొలుత చాహల్ పేరు లేదు. మిచెల్ స్టార్క్ వేసిన చివరి ఓవర్‌లో బంతి హెల్మెట్‌కు తాకడంతో జడేజా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, అతడికి ప్రత్యామ్నాయంగా చాహల్ బరిలోకి వచ్చాడు. ఇక, గాయపడిన జడేజా టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడు. 

Updated Date - 2020-12-05T23:48:31+05:30 IST