సరిలేరు నీకెవ్వరు

ABN , First Publish Date - 2020-10-27T09:13:10+05:30 IST

ఫార్ములావన్‌లో రికార్డుల రారాజు, బ్రిటన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో ఘనత సాధించాడు. రెండువారాల క్రితం జర్మనీలో టైటిల్‌తో

సరిలేరు నీకెవ్వరు

 ఎఫ్‌1లో హామిల్టన్‌ కొత్త చరిత్ర

92వ విజయంతో షుమాకర్‌ రికార్డు బద్దలు


పోర్టిమావో (పోర్చుగల్‌): ఫార్ములావన్‌లో రికార్డుల రారాజు, బ్రిటన్‌ స్టార్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో ఘనత సాధించాడు. రెండువారాల క్రితం జర్మనీలో టైటిల్‌తో దిగ్గజ రేసర్‌ మైకేల్‌ షుమాకర్‌ 91 విజయాల రికార్డును సమం చేసిన హామిల్టన్‌.. ఇప్పుడు ఆ రికార్డునూ బద్దలుకొట్టాడు. ఆదివారం జరిగిన పోర్చుగీస్‌ గ్రాండ్‌ ప్రీ రేసులో చాంపియన్‌గా నిలిచి కెరీర్‌లో 92వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఎఫ్‌1 చరిత్రలోనే అత్యధిక విజయాలు అందుకున్న రేసర్‌గా 35 ఏళ్ల హామిల్టన్‌ చరిత్ర సృష్టించాడు. పోల్‌ పొజిషన్‌తో ఫైనల్‌ రేసును ప్రారంభించిన ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌.. గంటా 29 నిమిషాల 56.828 సెకన్లలో గమ్యాన్ని చేరాడు. మెర్సిడె్‌సకే చెందిన వాల్టెరి బొటాస్‌ రెండోస్థానం, రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్స్‌టాపెన్‌ మూడోస్థానం దక్కించుకున్నారు. 

షుమాకర్‌ను మించి..: మెక్‌లారెన్‌ జట్టు తరఫున ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన హామిల్టన్‌ 2007లో తొలిసారి ఎఫ్‌1 రేసు గెలిచాడు. ఆ మరుసటి ఏడాదే డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌ గెలిచి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా (23 ఏళ్లు) రికార్డు నెలకొల్పాడు. అయితే, 2013లో మెర్సిడెస్‌ జట్టుకు మారిన తర్వాత హామిల్టన్‌ కెరీర్‌ అత్యున్నత శిఖరాలకు చేరింది. మెర్సిడెస్‌ తరఫున 173 రేసుల్లో పాల్గొన్న హామిల్టన్‌ ఏకంగా 71 సార్లు విజయం సాధించాడు. 2014, 15లో ప్రపంచ విజేతగా నిలిచిన హామిల్టన్‌.. ఆ తర్వాత 2017, 18, 19లోనూ టైటిళ్లు నెగ్గి హ్యాట్రిక్‌ సాధించాడు. దీంతో ఓవరాల్‌గా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ దక్కించుకొని ఈ జాబితాలో షుమాకర్‌ (ఏడుసార్లు) రికార్డుకు అడుగుదూరంలో నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తం 11 రేసుల్లో పాల్గొన్న హామిల్టన్‌ రికార్డుస్థాయిలో ఎనిమిదింటిలో గెలుపొందడం విశేషం. 

Updated Date - 2020-10-27T09:13:10+05:30 IST