ఉవ్వెత్తున ఎగిసి..
ABN , First Publish Date - 2020-12-30T07:10:59+05:30 IST
తొలి టెస్ట్‌లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకొని తర్వాతి మ్యాచ్‌లోనే గొప్ప విజయం సాధించిన

తొలి టెస్ట్‌లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకొని తర్వాతి మ్యాచ్‌లోనే గొప్ప విజయం సాధించిన టీమిండియా.. ఒక్క ఆస్ట్రేలియాకే కాదు ప్రపంచ జట్లకు కూడా గట్టి హెచ్చరికలు పంపింది. భారత జట్టు స్టార్ల మీదే ఆధారపడబోదని.. బెంచ్ బలంతో పటిష్ఠంగా ఉందని బాక్సింగ్ డే టెస్ట్ విజయంతో చాటింది. అడిలైడ్‌లో దారుణ ప్రదర్శన తర్వాత టీమిండియా మెల్‌బోర్న్‌లో రెండో టెస్ట్‌కు సిద్ధమైంది.
గులాబీ టెస్ట్ ఓటమితో టీమిండియా ఆత్మవిశ్వాసం సన్నగిల్లగా.. కోహ్లీ, షమి దూరం కావడంతో కష్టాలు మరింతగా పెరిగాయి. మ్యాచ్ మధ్యలో ఉమేష్ గాయపడినా ఉన్న వనరులతోనే రహానె అండ్ కో అద్భుత విజయాన్ని సొంతం చేసుకొంది. ఎక్కడ పోగొట్టుకుందో.. వారం తిరిగే సరికి అక్కడే శభాష్ అనిపించుకొంది. పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలుకుతూ.. ఉరకలెత్తే ఉత్సాహంతో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టనుంది.
మెల్‌బోర్న్‌లో ‘4’
ఎంసీజీలో గెలుపుతో విదేశీగడ్డపై భారత్ 52వ టెస్ట్ విజయాన్నందుకుంది. అంతేకాకుండా విదేశాల్లో టీమిండియాకు అచ్చొచ్చిన అత్యుత్తమ వేదిక మెల్‌బోర్న్. 1978 నుంచి చూస్తే ఎంసీజీలో భారత్‌కు ఇది నాలుగో విజయం. ఇంగ్లండ్ మినహా ఇతర జట్లు ఏవీ ఈ వేదికపై మూడు కంటే ఎక్కువ టెస్ట్‌లు నెగ్గలేదు.
అలా గెలిచిన 3వ జట్టుగా..
గడచిన 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై 0-1తో వెనుకబడి.. రెండో టెస్ట్‌లో పుంజుకొన్న మూడో టీమ్‌గా భారత్ రికార్డులకెక్కింది. 1975-76లో వెస్టిండీస్ పెర్త్ టెస్ట్‌లో ఈ ఘనతను అందుకొంది. ఆ తర్వాత 2011లో న్యూజిలాండ్ తొలి టెస్ట్‌లో ఓడినా.. హోబర్ట్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో నెగ్గి సిరీ్‌సను సమం చేసింది.
టీమిండియాదే పైచేయి..
ఈ శతాబ్దంలో ఆస్ట్రేలియా జట్టు భారత టూర్‌లో సాధించిన విజయాల కంటే.. టీమిండియా ఆసీస్ గడ్డపై గెలిచిన టెస్ట్‌లే ఎక్కువ. భారత్‌లో ఆడిన 21 టెస్టుల్లో ఆసీస్ 4 మ్యాచ్‌లు నెగ్గగా.. ఆస్ట్రేలియా పర్యటనలో 22 టెస్ట్‌లు ఆడిన టీమిండియా 5 మ్యాచ్‌లు గెలిచింది.
అత్యల్ప స్కోరు తర్వాత..
50.. అంతకంటే తక్కువ స్కోరు చేసి.. తర్వాతి టెస్ట్‌లో నెగ్గిన మూడో టీమ్‌గా భారత్ రికార్డుల కెక్కింది. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. గతంలో ఇంగ్లండ్ ఇలా రెండుసార్లు (ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌లపై) గెలవగా, దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఇదే తరహాలో నెగ్గింది.
32 ఏళ్లలో
సొంతగడ్డపై టెస్టుల్లో ఒక్క ఆస్ట్రేలియాబ్యాట్స్‌మెన్ కూడా అర్ధ శతకం చేయకపోవడం గత 32ఏళ్లలో ఇదే తొలిసారి.
కంగారూలకు జరిమానా
స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు భారీ జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతతో పాటు ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షి్‌పలోని నాలుగు పాయింట్లు కూడా ఆసీస్ కోల్పోనుంది.