‘శతక’బాదిన స్టోక్స్
ABN , First Publish Date - 2020-10-27T09:17:35+05:30 IST
బెన్ స్టోక్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకొచ్చాడు. ఏకంగా అజేయ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 107 నాటౌట్) కదం తొక్కాడు.

ముంబైపై రాజస్థాన్ ఘన విజయం
అబుదాబి: బెన్ స్టోక్స్ ఎట్టకేలకు ఫామ్‌లోకొచ్చాడు. ఏకంగా అజేయ శతకంతో (60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 107 నాటౌట్) కదం తొక్కాడు. అతడికి సంజూ శాంసన్ (31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో ముంబైకి రాజస్థాన్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లతో నెగ్గిన రాజస్థాన్ ప్లేఆప్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 195/5 స్కోరు చేసింది. హార్దిక్ పాండ్యా (21 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 60 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (40), ఇషాన్ కిషన్ (37) రాణించారు. అనంతరం రాజస్థాన్ 18.2 ఓవర్లలో 196/2 స్కోరు చేసి గెలుపొందింది. స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
పాండ్యా సునామీ ఆట: ముంబై ఇన్నింగ్స్‌ను కిషన్, సూర్యకుమార్, తివారీ చక్కదిద్దినా..ప్రత్యర్థి ఎదుట ఆ జట్టు భారీ లక్ష్యాన్ని ఉంచిందంటే అందుకు హార్దిక్ పాండ్యా సునామీ ఆటే కారణం. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న హార్దిక్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కాగా ‘బ్లాక్స్ లైవ్స్ మ్యాటర్’కు సంఘీభా వంగా హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ తర్వాత మోకాలిపై నిల్చుని పిడికిలి బిగించి ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు.