ఉగ్రదాడుల్లేకుండా హామీ ఇస్తారా?

ABN , First Publish Date - 2020-06-26T08:41:58+05:30 IST

తమ ఆటగాళ్ల భద్రత, వీసా మంజూరీలపై డిమాండ్‌ చేసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు బీసీసీఐ ఘాటుగానే బదులిచ్చింది. ముందు భారత్‌లో పాక్‌ ...

ఉగ్రదాడుల్లేకుండా హామీ ఇస్తారా?

భారత్‌లో వచ్చే మూడేళ్లలో రెండు ప్రపంచకప్‌లు జరగబోతున్నాయి. అయితే ఈ మెగా టోర్నీల్లో ఆడాలంటే తమ ఆటగాళ్ల భద్రతపై బీసీసీఐ నుంచి లిఖిత పూర్వక హామీ ఇప్పించాలంటూ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఐసీసీని కోరుతోంది. దీంతో అటు భారత క్రికెట్‌ బోర్డు కూడా ఘాటుగానే స్పందించింది. సరిహద్దుల ద్వారా అక్రమ చొరబాట్లు జరగకుండా పాక్‌ ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ ఇప్పించగలరా? అని ప్రశ్నించడంతో ఇరు బోర్డుల మధ్య మాటల వేడి పెరిగినట్టయింది..


పాక్‌ బోర్డును ప్రశ్నించిన బీసీసీఐ

తమ భద్రతపై హామీ కోరిన పీసీబీ

ఘాటుగా బదులిచ్చిన భారత బోర్డు


న్యూఢిల్లీ:  తమ ఆటగాళ్ల భద్రత, వీసా మంజూరీలపై డిమాండ్‌ చేసిన పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ)కు బీసీసీఐ ఘాటుగానే బదులిచ్చింది. ముందు భారత్‌లో పాక్‌ ఉగ్రదాడులను నిలువరించేందుకు హామీ కావాలని తేల్చి చెప్పింది. క్రికెట్‌ వ్యవహారాల్లో ప్రభుత్వాల జోక్యం ఉండకూడదని ఐసీసీ నిబంధనల్లో స్పష్టంగా ఉందని బీసీసీఐ గుర్తు చేసింది. అలాగే ప్రభుత్వ వ్యవహరాల్లోనూ ఆయా క్రికెట్‌ బోర్డులు తలదూర్చవని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ‘మా దేశ సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను అరికట్టడం, అలాగే కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించడం లేదా మరోసారి పుల్వామా తరహా ఉగ్రదాడి జరగకుండా చూసేలా పాక్‌ ప్రభుత్వం నుంచి మీరు హామీ ఇప్పిస్తారా? క్రీడాపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని ఐసీసీ నిబంధనల్లో  స్పష్టంగా ఉంది. అలాగే ప్రభుత్వ విధుల్లో ఓ క్రీడా బోర్డు ఎలా వేలు పెడుతుంది? ముందు పీసీబీ ఓ వ్యక్తిగత ఏజెంట్‌లా వ్యవహరించడం మానుకోవాలి. భారత్‌ ఓ అద్భుత దేశమనే విషయం గుర్తుంచుకోండి’ అని ఆ అధికారి సూటిగా తెలిపారు.


పాక్‌ ఆటగాళ్ల భద్రతపై ఏం చేస్తారు?

కరాచీ: వచ్చే ఏడాది భారత్‌లో జరగబోయే టీ20 ప్రపంచకప్‌, 2023లో జరిగే వన్డే వరల్డ్‌క్‌పలో ఆడేందుకు తాము సిద్ధమేనని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. కానీ అంతకన్నా ముందు ఈ రెండు ప్రపంచక్‌పల్లో పాల్గొనేందుకు వీసాల మంజూరీతో పాటు క్రికెటర్ల భద్రతపై బీసీసీఐ చేత లిఖిత పూర్వక హామీ ఇప్పించాలని ఐసీసీని కోరింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త  పరిస్థితుల కారణంగా ఇప్పటికే ద్వైపాక్షిక సిరీ్‌సలు జరగడం లేదు. ఇక భారత్‌లోనే జరిగే ఈ ఐసీసీ టోర్నీల్లో పాక్‌ను అనుమతిస్తారా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. అందుకే పీసీబీ ముందు జాగ్రత్తగా టోర్నీ సందర్భంగా తమకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలంటోంది. ‘భారత్‌లో జరిగే ప్రపంచక్‌ప ల విషయమై మేం ఇప్పటికే ఆలోచించాం. ఈ నేపథ్యంలోనే మా జట్టుకు వీసాల మంజూరుతో పాటు ఇతర సమస్యలేమీ లేకుండా బీసీసీఐ నుంచి హామీ కావాలని ఇదివరకే ఐసీసీని కోరాం. మరికొద్ది నెలల్లోనే ఈ విషయమై స్పష్టత కావాలని కూడా చెప్పాం. ఎందుకంటే కొంతకాలం క్రితం భారత్‌లో జరిగిన కొన్ని క్రీడా ఈవెంట్లలో మా జట్లను అనుమతించలేదు. అయినా ఇది ఐసీసీ టోర్నీ కాబట్టి మా బాధ్యత కూడా వారిపైనే ఉంటుంది’ అని పీసీబీ సీఈవో వసీం ఖాన్‌ తేల్చారు.


ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవు

 బీసీసీఐతో తమ సంబంధాలేమీ చెడిపోలేదని వసీం ఖాన్‌ అన్నాడు. భారత క్రికెట్‌ బోర్డుతో ఇబ్బందేమీ లేకపోయినా ఇరు జట్ల మధ్య క్రికెట్‌ సంబంధాలు మెరుగవడం అంత సులువు కాదని చెప్పాడు. రెండు దేశాల్లోనూ క్రికెట్‌ పునరుద్ధరణకు తగిన వాతావరణం లేదనే విషయం వసీం ఖాన్‌ గుర్తుచేశాడు.  అందుకే భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్ల మధ్య సమీప భవిష్యత్తులో ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగే అవకాశాలైతే కనిపించడంలేదని వసీం ఖాన్‌ స్పష్టం చేశాడు. ఇదిలావుండగా షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబరులోనే ఆసియా కప్‌ జరుగుతుందని తెలిపాడు. అయితే శ్రీలంక లేదా యూఏఈలలో నిర్వహించే అవకాశం ఉందని చెప్పాడు.  

Updated Date - 2020-06-26T08:41:58+05:30 IST