24న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం.. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లపై చర్చ!

ABN , First Publish Date - 2020-12-03T22:11:56+05:30 IST

ఈ నెల 24న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల చేరిక, ఐసీసీకి భారత ప్రతినిధుల

24న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం.. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లపై చర్చ!

ముంబై: ఈ నెల 24న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఐపీఎల్‌లో రెండు కొత్త జట్ల చేరిక, ఐసీసీకి భారత ప్రతినిధుల ఎంపిక, అలాగే ముగ్గురు జాతీయ సెలక్టర్ల ఎంపిక వంటి వాటిపై సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. కొత్త వైస్-ప్రెసిడెంట్ ఎన్నిక అజెండాపైనా చర్చించనున్నట్టు సమాచారం. నిబంధనల ప్రకారం ఏజీఎంకు 21 రోజుల ముందే అన్ని అనుబంధ యూనిట్లకు 23 పాయింట్ల అజెండాను బీసీసీఐ పంపింది. సమావేశంలో అన్నింటి కంటే రెండు కొత్త జట్లకు అనుమతిపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త జట్లకు అనుమతి లభిస్తే ఐపీఎల్‌లో మొత్తం జట్ల సంఖ్య 10కి చేరుకుంటుంది.


అదాని గ్రూప్, సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీజీ (రైజింగ్ పూణె సూపర్‌జెయింట్స్ యజమానులు) కొత్త జట్లపై ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకటి అహ్మదాబాద్ కేంద్రంగా ఉండగా, పదో జట్టు కాన్పూర్, లక్నో, లేదంటే పూణె నుంచి వచ్చే అవకాశాలున్నాయి. ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో భారత ప్రతినిధుల నియామకం గురించి కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. బోర్డు కార్యద్శి జే షా ఐసీసీ, ఏసీసీలో బీసీసీఐ ప్రతినిధిగా వెళ్లే అవకాశం ఉంది.  

Updated Date - 2020-12-03T22:11:56+05:30 IST