ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌కు..
ABN , First Publish Date - 2020-05-09T10:09:54+05:30 IST
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో టీమిండియా పర్యటనకు ఢోకాలేనట్టే కన్పిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న ఆంక్షల ...
టీమిండియా సిద్ధమన్న బీసీసీఐ
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఈ ఏడాది చివర్లో టీమిండియా పర్యటనకు ఢోకాలేనట్టే కన్పిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఉన్న ఆంక్షల దరిమిలా ఈ సిరీస్ జరుగుతుందో లేదోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పర్యాటక ఆంక్షలను ఆస్ట్రేలియా సడలిస్తే.. అక్కడికి వెళ్లడంతోపాటు రెండువారాల క్వారంటైన్‌కు కోహ్లీసేన సిద్ధంగా ఉందని బీసీసీఐ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఈ డిసెంబరు, వచ్చే ఏడాది జనవరిలో జరిగే పర్యటనలో భారత జట్టు ఆస్ట్రేలియాతో 4 టెస్ట్‌లు, 3 వన్డేలలో తలపడాల్సి ఉంది. కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వాటినుంచి కోలుకొనేందుకు టీమిండియాతో సిరీ్‌సను ఎలాగైనా నిర్వహించాలని భావిస్తోంది. బీసీసీఐ కూడా ఆసీస్ పర్యటనకు సుముఖంగా ఉంది. బోర్డు కోశాధికారి అరుణ్ ధూమల్ మాట్లాడుతూ ‘క్రికెట్ పునరుద్ధరణ జరగాలంటే ఏ జట్టయినా క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. అయితే ఐదో టెస్ట్‌కోసం క్రికెట్ ఆస్ట్రేలియా పట్టుబడుతోంది. కానీ ధూమల్ మాత్రం టెస్ట్‌కన్నా పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడడం ఆర్థికంగా లాభసాటిగా ఉంటుందని సూచించారు. ‘అదనపు మ్యాచ్‌లకు అవకాశం ఉంటే రెండు వన్డేలు లేదా రెండు టీ20లు ఆడడం ఉత్తమం’ అని అన్నారు.
ఆ మెగా టోర్నీ కష్టమే: అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగడం కష్టమేనని ధూమల్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌నుంచి బయటకు వచ్చినా మెగా టోర్నీకి అవసరమైన ఫిట్‌నెస్ ఆటగాళ్లలో ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమేనన్నారు. ‘సుదీర్ఘకాలం ఆటకు దూరంగా ఉన్న క్రికెటర్లు ప్రపంచకప్‌నకు సరైన సన్నద్ధత లేకుండా బరిలోకి దిగేందుకు బోర్డులు అంగీకరిస్తాయనుకోను’ అని ఆయన చెప్పారు.