బంగ్లా మాజీ కెప్టెన్‌ మోర్తజాకు కరోనా

ABN , First Publish Date - 2020-06-21T08:35:04+05:30 IST

సాధారణ ప్రజానీకం నుంచి సెలెబ్రిటీల దాకా కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బంగ్లా పార్లమెంట్‌ సభ్యుడైన మష్రాఫె మోర్తజాకు...

బంగ్లా మాజీ కెప్టెన్‌ మోర్తజాకు కరోనా

ఢాకా: సాధారణ ప్రజానీకం నుంచి సెలెబ్రిటీల దాకా కొవిడ్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. బంగ్లాదేశ్‌ క్రికెట్‌ మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బంగ్లా పార్లమెంట్‌ సభ్యుడైన మష్రాఫె మోర్తజాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మోర్తజా స్వయంగా స్పష్టం చేశాడు. దీంతో పాక్‌ మాజీ సారథి షాహిద్‌ అఫ్రీది తర్వాత కరోనా బారిన పడ్డ రెండో అతిపెద్ద క్రికెట్‌ సెలెబ్రిటీగా మోర్తజా నిలిచాడు. ప్రస్తుతం ఢాకాలోని తన నివాసంలో సెల్ఫ్‌ ఐసొలేషన్‌లో ఉన్నానని 36 ఏళ్ల మోర్తజా వెల్లడించాడు. ‘రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతున్నా. ఈరోజు పరీక్షలు చేయించుకున్నా.. పాజిటివ్‌ అని తేలింది. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి’ అని మోర్తజా ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశాడు. ప్రజా ప్రతినిధి కూడా అయిన మోర్తజా ఇటీవల తన సొంత నియోజకవర్గమైన నరైల్‌లో కరోనా కారణంగా నిరాశ్రయులైన బాధితులను కలుసుకొని సహాయం అందజేశాడు. మోర్తజాతో పాటు బంగ్లాకే చెందిన లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ నజ్ముల్‌ ఇస్లామ్‌, మాజీ క్రికెటర్‌ నఫీజ్‌ ఇక్బాల్‌కు కూడా కరోనా సోకినట్టు అక్కడి మీడియా తెలిపింది. వీరిద్దరూ ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత బంగ్లా వన్డే కెప్టెన్‌ తమీమ్‌ ఇక్బాల్‌కు నఫీజ్‌ సోదరుడు.  

Updated Date - 2020-06-21T08:35:04+05:30 IST