అప్పటికి బూమ్రానే సూపర్ స్టార్
ABN , First Publish Date - 2020-11-16T04:33:09+05:30 IST
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రాపై ఆస్ట్రేలియా మాజీ గిలెస్పీ ప్రశంసల జల్లు కురిపించాడు. బూమ్రా లాంటి మేటి బౌలర్ జట్టుకు దొరకడం భారత్ అదృష్టమని...
కాన్‌బెర్రా: భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బూమ్రాపై ఆస్ట్రేలియా మాజీ గిలెస్పీ ప్రశంసల జల్లు కురిపించాడు. బూమ్రా లాంటి మేటి బౌలర్ జట్టుకు దొరకడం భారత్ అదృష్టమని వ్యాఖ్యానించాడు. ఈ నెల 27 నుంచి ఆస్ట్రేలియా-భారత్‌ల మధ్య 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టుల సిరీస్ జరగనుంది. ఈ నేపథ్యంలో గిలెస్పీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సందరించుకున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గిలెస్పీ.. ఈ సిరీస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం టీమ్‌ఇండియా బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్‌లోనూ అద్భుత ఫాంలో ఉందన్నాడు. ముఖ్యంగా పేస్ విభాగం ప్రపంచంలోనే మేటిగా ఉందని కితాబిచ్చాడు. 2018-19 సీజన్‌లో కోహ్లీసేన ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో గెలిచిన విషయాన్నీ గిలెస్పీ గుర్తు చేశాడు. బుమ్రా, షమి, ఇషాంత్ భారత్‌కు ఎంతో బలమని, ఈ ముగ్గురూ అత్యుత్తమంగా రాణిస్తున్నారని అన్నాడు. అలాంటి బౌలింగ్ యూనిట్‌ను ఎదుర్కోవడం ఆసిస్‌కు కత్తిమీద సామేనని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా బూమ్రా గొప్ప స్టార్ అంటూ ఆకాశానికెత్తేశాడు.
‘బుమ్రా కెరీర్ చివరికల్లా సూపర్‌స్టార్ అవుతాడు. 3 ఫార్మాట్లలో టీమ్‌ఇండియా ఆల్‌టైమ్ అత్యుత్తమ పేసర్‌గా నిలుస్తాడనడంలో సందేహం లేదు. ఇక షమి కూడా అద్భుతమైన బౌలర్. ఇషాంత్ ఎంత ముఖ్యమైన ఆటగాడో ఇప్పటికే నిరూపించుకున్నాడు. అతడి కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఉన్నా తన విలువేంటో తెలియజేశాడు. ఇప్పటికీ టెస్టుల్లో సత్తా చాటుతూనే ఉన్నాడు. ఇక భువి, ఉమేశ్ యాదవ్ సైతం అద్భుతమైన పేసర్లే.

ఒకప్పుడు జవగళ్ శ్రీనాథ్ భారత జట్టు పేస్ దళానికి వెన్నెముకగా నిలిచాడు. ఆపై జహీర్ పేసర్లకే వన్నె తెచ్చాడు. వాళ్లతో వీళ్లని పోల్చడం కష్టమే అయినా, బౌలింగ్ యూనిట్‌లో మాత్రం బలం పెరిగింది’ అని గిలెస్పీ చెప్పుకొచ్చాడు. అయితే వీళ్లను ప్రశంసించడం అంటే.. మునుపటి ఆటగాళ్లను కించపర్చడం తన ఉద్దేశం కాదని, ప్రస్తుతం కాలంలో వీరే బెస్ట్ అని చెబుతున్నానని గిలెస్పీ క్లారిటీ ఇచ్చాడు.